BRS Defeat Reasons : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయఢంకా మోగించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎత్తుకున్న..

BRS Defeat Reasons : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

BRS Defeat Reasons

జోరు మీదున్న కారుకు సడెన్ బ్రేకులు పడ్డాయి. చేతి పార్టీ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చిన పార్టీకి, ఇచ్చిన పార్టీకి మధ్యలో జరిగిన పోరులో ఎట్టకేలకు జనం సోనియమ్మ పార్టీకి జేజేలు పలికారు. అసెంబ్లీ ఎన్నికల ముందువరకు పెద్దగా అంచనాలు లేని కాంగ్రెస్ ఎలా పుంజుకోగలిగింది? తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ విజయ రహస్యాలా? హస్తం వ్యూహాన్ని గులాబీదళం గుర్తించలేకపోయిందా? కాంగ్రెస్ జైత్రయాత్రకు దోహదపడిన అంశాలు ఏంటి?

అద్భుతంగా పని చేసిన మార్పు నినాదం..
మహాభారత యుద్ధంలో కౌరవుల ఓటమికి, కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ విజయఢంకా మోగించడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ ఎత్తుకున్న మార్పు నినాదం అద్భుతంగా పని చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు అన్నింటిలోనూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదమే ప్రతిధ్వనించింది.

ఆ 20-25 మందే బీఆర్ఎస్ ను ముంచారా?
పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలకు మోజు తీరిన వాతావరణం కనిపించి మార్పు కోసం జనం మొగ్గుచూపినట్లుగా ఉంది. కనీసం 25 నుంచి 30మంది ఎమ్మెల్యేలతో జనం విసిగిపోయి ఉన్నారని, వీరిని మార్చడం మంచిదని పలు రకాలుగా ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత వేరే లెక్కలు వేసి వారికి మళ్లీ టికెట్లు కట్టబెట్టడం పెను ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది.

Also Read : ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

బీజేపీ పడేసిన కాడిని కాంగ్రెస్ ఎత్తుకుంది..
ఇలా బీఆర్ఎస్ లో టికెట్లు రాక, లేదా తగినంత గుర్తింపు లభించక.. అసంతృప్తితో ఉన్న దాదాపు 25మంది నేతలను కాంగ్రెస్ అక్కున చేర్చుకుని వారిలో కొందరికి టికెట్లు కేటాయించడం కలిసి వచ్చింది. బీజేపీ నుంచి చివరి క్షణంలో వచ్చిన కొందరు నేతలు కూడా కాంగ్రెస్ కు ఊపుతెచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో పలచన చేయడంలో సఫలీకృతమైన బీజేపీ.. ఆ తర్వాతి పరిణామాల్లో బండి సంజయ్ ను మార్చడం, కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ తో రాజీపడ్డారనే ప్రచారం పుంజుకోవడంతో బీజేపీ కాడి కిందన పడేసినట్లు అయ్యింది. అదే కాడిని కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరింత స్థాయిలో యద్ధం ప్రకటించింది.

బీఆర్ఎస్ ను దెబ్బతీసిన ఆ రెండు వాగ్దానాలు..
ఇక ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయడం అనేది కాంగ్రెస్ చేసిన అత్యుత్తమ నిర్ణయమైంది. కేసీఆర్ ను ఢీకొట్టడానికి సరైన సత్తా ఉన్న నేత రేవంత్ రెడ్డి అని అభిప్రాయం జనంలో ప్రబలడంతో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ఒక దశలో బండి సంజయ్ కు ఇలాంటి గుర్తింపు ఉన్నా ఆయనను తప్పించడం ద్వారా బీజేపీ చేతులారా కాంగ్రెస్ కు అవకాశం ఉంది. ఇక రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ చేసిన వాగ్దానాలు నెరవేరకపోవడంతో వీటిపై ఆశలు పెట్టుకున్న జనం కత్తిగట్టారు.

Also Read : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

కొంపముంచిన దళితబంధు స్కీమ్.. దెబ్బకొట్టిన యువత, నిరుద్యోగులు..
సలార్ సినిమా ట్రైలర్ లో ప్రస్తావించినట్లు కేసీఆర్ ఎరగా వేసిన కొన్ని పథకాలు సొరగా మారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మింగేశాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దళితబంధు పథకం. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ ను దెబ్బతీయడం కోసం పుట్టుకొచ్చిన దళితబంధు పథకం నామమాత్రంగానే అమలు కావడంతో పాటు ఉన్న కొద్దిమంది లబ్దిదారుల విషయంలోనూ భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎన్ని చెప్పినా వీటిని ఎదుర్కోలేని పరిస్థితిని బీఆర్ఎస్ కొనితెచ్చుకుంది. పైగా ఇతర సామాజికవర్గ ఓటర్లలో ఇది అసంతృప్తి రగిలించింది. యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.