BRS Mistakes : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

ఎవరైనా.. ఎంత పెద్ద వారైనా.. ప్రజలను తక్కువ అంచనా వేయరాదు. మార్పు కోసం జనం పరితపిస్తుంటారు. నచ్చని నాయకులను ఇంటికి పంపిస్తారు. అందుకే... ప్రజాస్వామ్యంలో అందరికంటే ప్రజలే గొప్పవారు. వాళ్ల నిర్ణయమే అల్టిమేట్.

BRS Mistakes : కేసీఆర్ ఇలా చేసుంటే.. బీఆర్ఎస్ ఓటమి తప్పేదా?

BRS Mistakes

ఎంత పెద్ద నాయకుడికైనా, పార్టీకైనా.. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజా వ్యతిరేకత రావడం సహజం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే కేసీఆర్ కాస్త ముందు జాగ్రత్త పడి.. కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఉంటే, పరిస్థితి మరో విధంగా ఉండేదేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం, సిట్టింగుల్లో 20 నుంచి 25 మంది అభ్యర్థులను మార్చడం, బీఆర్‌ఎస్ పేరుకు బదులుగా టీఆర్‌ఎస్‌గానే కొనసాగి ఉండడం వంటివి.. గులాబీ జెండా రెపరెపలాడడానికి కారణమయ్యేవి. కొన్ని విషయాల్లో కేసీఆర్ జాగ్రత్త పడకపోవడంతో ఫలితం మరోలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేటీఆర్ ను సీఎంను చేసుంటే..
కేసీఆర్ కాస్త ముందు జాగ్రత్త పడి.. కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇందులో మొదటిది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసి ఉండటం. వాస్తవానికి, దాదాపు రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించినప్పటికీ, ఎందుకో గానీ వెనుకంజ వేశారు. అప్పట్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసి ఉంటే.. ప్రభుత్వంలోకి కొత్త రక్తాన్ని, యువ రక్తాన్ని ఎక్కించినట్లయ్యేది. కేటీఆర్‌కి కూడా తనదైన ముద్ర వేసే అవకాశం ఉండేది.

ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా, కేసీఆర్ ప్రతిష్ట దాదాపు నిలకడగా ఉండేది. అదే స్ధాయిలో నిలబడేది. 2009-2014 యూపీఏ ప్రభుత్వ హయాంలో రాహుల్ గాంధీని ప్రధాని చేసే అవకాశం సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నా.. ఎందుకోగానీ ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ విషయంలో సోనియా గాంధీ చారిత్రక తప్పిదం చేశారని.. కేసీఆర్ పలుమార్లు తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు చెబుతారు. మరి ఎందుకోగానీ, కేసీఆర్ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయారు.

Also Read : తిరుగే లేదనుకున్న కారు ఎక్కడ బోల్తా పడింది? బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు అవేనా?

ఆ 20-25 మందే బీఆర్ఎస్ ను ముంచారా?
ఇక రెండోది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న 20 నుంచి 25 మంది అభ్యర్ధులను మార్చడం ఉత్తమమని, బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ జరిగింది. ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు కూడా ఈ విషయంలో కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. అయితే ఏ కారణం వల్లనో గానీ, కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు కేటాయించారు. వీరందరూ.. ఆర్ధికంగా బలంగా ఉండి, తమకంటూ కొంత ప్రాబల్యం కలిగి ఉన్నారని.. వీళ్లని మార్చేస్తే.. వారు కాంగ్రెస్ లోనో, బీజేపీలోనో చేరి బీఆర్ఎస్‌ కు ప్రధాన ప్రత్యర్థులుగా మారే ప్రమాదం ఉందని.. కేసీఆర్ భావించారని పార్టీ వర్గాల్లో చర్చ ఉంది.

ఆ రకంగా చూస్తే.. కేసీఆర్ ఆలోచనల్లో మెరిట్ ఉందనిపిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే.. మంచైనా, చెడైనా వీరి బ్యాగేజీని కూడా కొనసాగించాల్సిన పరిస్థితులు కేసీఆర్ ఎదుర్కొన్నారు. అయితే ఈ 20-25 మంది అభ్యర్ధుల పట్ల వారి నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేకత.. చివరికి పార్టీకి నష్టం కలిగించింది. వీరు ఓడిపోవాలని ప్రజలే కాకుండా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పంతం పట్టారని చెబుతున్నారు.

తీవ్ర ప్రభావం చూపిన కేసీఆర్ వ్యవహారశైలి?
ఇక కేసీఆర్ కూడా తన వ్యవహార శైలిని కొంత మార్చుకుని ఉంటే.. పార్టీకి చాలా మేలు జరిగేదని, ఆ పార్టీ నాయకులే పలువురు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, కేసీఆర్‌కు నూటికి రెండొందల పాళ్లు నిబద్ధత ఉందని, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న విజన్‌తో పోటీపడే మరో నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో లేరని.. పార్టీ వర్గాలు బలంగా నమ్ముతాయి. అయితే.. ప్రజలతో, నాయకులతో చివరికి కొందరు ఎమ్మెల్యేలతో, మంత్రులతో మమేకమయ్యే విషయంలో.. కేసీఆర్ కొంత నిర్లిప్త వైఖరిని, మొండివైఖరిని అవలంభించారని, దీని వల్ల ఆయన ఫామ్ హౌస్ ముఖ్యమంత్రని విమర్శించి.. ప్రజల్లో ఆ అభిప్రాయం ప్రబలేలా ప్రతిపక్షాలు విజయవంతం కాగలిగాయని, బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా.. అంతా ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారని.. ప్రతిపక్షాలు బలంగా విమర్శించడం కూడా.. కేసీఆర్ వ్యవహార శైలిపై ప్రజల్లో ప్రతికూల ప్రభావం ఏర్పడడానికి కారణమని ఆ పార్టీ శ్రేణులు అంగీకరిస్తున్నాయి.

కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు అదేనా?
ఇక టీఆర్ఎస్‌ను.. బీఆర్ఎస్ పార్టీగా మార్చి, మహారాష్ట్రలో, మరికొన్ని చోట్ల విస్తరింపచేయడానికి కేసీఆర్ పన్నిన వ్యూహం కూడా బీఆర్ఎస్‌ను దెబ్బతీసిందని.. ప్రతిపక్షాలే కాదు, స్వపక్ష నేతలు కూడా చెబుతున్నారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరించడానికి, కేసీఆర్ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ప్రజలంతా ఇది గమనిస్తూనే ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు.

Also Read : ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

అసలు టీఆర్ఎస్ బలమే తెలంగాణ. అలాంటి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడమే.. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు అని విశ్లేషకులు అంటున్నారు. అదే కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మున్ముందు ప్రాంతీయ పార్టీలకే భవిష్యత్తు అని పలుమార్లు వ్యాఖ్యానించడం కూడా ప్రజల్లో కొంత దురభిప్రాయాన్ని సృష్టించిందని, దీనిని కేసీఆర్ అవకాశవాద ధోరణిగా ప్రజలు భావించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పటికేది ప్రస్తుతమో అదే కేసీఆర్ చెబుతుంటారని, తద్వారా ప్రజల్లో తన పట్ల ఉన్న నమ్మకానికి.. అది భారీగా గండి కొట్టిందని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.

బీఆర్ఎస్ ముందున్న ఏకైక మార్గం అదే..
తెలంగాణ సాధించేవరకు.. కేసీఆర్ ప్రజల దృష్టిలో హీరో. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ఒక ముఖ్యమంత్రి మాత్రమే. రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో.. కేసీఆర్‌ను ప్రజలు కేవలం ఒక పార్టీ అగ్రనేతగానే భావించారని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయనకు గతంలో ఉన్న గౌరవం ఇప్పుడు సన్నగిల్లిపోయిందని.. దాని ఫలితాలనే ఈ ఎన్నికల్లో చూస్తున్నామని ఒక ప్రముఖ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఈ విశ్లేషణ మొత్తం .. ఇప్పుడు పోస్టుమార్టం లాంటిదే. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఆలోచించాల్సింది మాత్రం ఒక్కటే.. జరిగిన పొరపాట్లను సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణను, వ్యూహాన్ని రూపొందించుకోవడమే బీఆర్‌ఎస్‌ ముందున్న ఏకైక మార్గం.

ప్రజలను తక్కువ అంచనా వేస్తే పెను ప్రమాదమే..
ఏది ఏమైనా అధికారంలోకి రావడం కష్టమైతే.. దాన్ని నిలబెట్టుకోవడం.. అదీ రెండు దఫాల అధికారం తర్వాత, మూడో దఫా కూడా నిలబెట్టుకోవడం.. చాలా చాలా కష్టం. ఈ ఎన్నికల్లో ఇదే రుజువయ్యింది. మొత్తం మీద చెప్పాలంటే ఎవరైనా.. ఎంత పెద్ద వారైనా.. ప్రజలను తక్కువ అంచనా వేయరాదు. మార్పు కోసం జనం పరితపిస్తుంటారు. నచ్చని నాయకులను ఇంటికి పంపిస్తారు. అందుకే… ప్రజాస్వామ్యంలో అందరికంటే ప్రజలే గొప్పవారు. వాళ్ల నిర్ణయమే అల్టిమేట్.