Bandi Sanjay Kumar
BJP MP Bandi Sanjay Kumar: రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మా గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా మా పార్టీకే ఉందని ప్రజలు భావించడం వల్లే దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఆదరించారు. నవంబర్ 30న జరగబోయే పోలింగ్ లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీజేపీని గెలిపించబోతున్నారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
నిధులు మావి.. సోకులు వాళ్లవి..
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతోనే అంతోఇంతో అభివృద్ధి చేస్తుంది. ప్రతీ పథకంలోనూ కేంద్రం నిధులే ఉన్నాయి. నిధులు కేంద్రానివి.. సోకులు మాత్రం రాష్ట్రానివి అంటూ బండి సంజయ్ విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనేది కేంద్ర ప్రభుత్వమే. ప్రతి గింజా మేము కొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలని సంజయ్ కోరారు. ఉపాధి హామీ డబ్బులు కూడా కేంద్రానివే.. కానీ, బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారంటూ సంజయ్ విమర్శించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. రైతులు పంటలు నష్టపోతే ఎందుకు పరిహారం ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు.
నేను అలా అనలేదు..
నేను బీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పానట.. వాళ్ల పేపర్లో రాసుకున్నరు.. ఫస్ట్ తారీఖునాడు జీతాలిస్తే ఓటేయమని చెప్పా.. మరి ఇస్తున్నారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తే ఆ పార్టీకి ఓటేయమన్న.. ఎందుకు ఇవన్నీ రాయలేదని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలు, వేధింపులు భరించలేక అనేక కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో దిమ్మతిరుగుతుందని చెప్పుకుంటున్నారు.. ఇదో పెద్ద జోక్ అంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. అమరవీరుల విగ్రహం దగ్గరకొచ్చి మీ మెనిఫెస్టో ఎంత వరకు అమలు చేసారో చర్చకు సిద్ధమా? బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే 5 లక్షల కోట్ల అప్పు.. పది లక్షల కోట్లు అవుతుందంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.
Singareni Elections: ఇప్పుడొద్దు.. సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
ఆ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తా ..
నిజాయితీతో, నిష్పక్షపాతంగా ఎన్నికల అధికారులు వ్యవహరించాలి. సామాన్యులు సొంత అవసరాలకోసం తీసుకెళ్తున్న డబ్బులను సీజ్ చేస్తున్నారంటూ సంజయ్ అన్నారు. పదవీకాలం పొడగించి సీఎం పేచీలో ఉన్న అధికారులను, ఇంటెలిజెన్స్ అధికారులను బదిలీ చేయాలి. దీనిపై మేము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని సంజయ్ తెలిపారు. కేటీఆర్ అహంకారంతో సిరిసిల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎందుకు చెప్పడం లేదని బండి సంజయ్ అన్నారు. తల్లి, చెల్లి పూజలు చేస్తుంటే.. కేటీఆర్ ఎందుకు పూజించడు.. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని నాకున్న తపనకూడా కేటీఆర్ కు లేదు. కేసీఆర్ బాగుండాలి.. మేము రాజకీయంగా కొట్లాడుతాం అని సంజయ్ అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా వచ్చే రజాకార్ సినిమా అంటే మీకు భయమెందుకు? మీరు నిజాం, రజాకార్ల వారసులా? ఎంఐఎం బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారంటూ బీఆర్ఎస్ ను సంజయ్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్యురిటీ వస్తే పెళ్లెప్పుడు? పిల్లలెప్పుడు? వారంటీ లేని పార్టీ గ్యారెంటీ ఇస్తే ఎవరు నమ్ముతారంటూ సంజయ్ కాంగ్రెస్ పార్టీనుద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. కరీంనగర్ లో పోటీ చేయాలనుందని నా కోరిక అధిష్టానంకు చెప్పాను. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీచేస్తా అని సంజయ్ అన్నారు.