సీఎం రేవంత్‌ను ఎవరైనా మెచ్చుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా- ఎంపీ ఈటల రాజేందర్

ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు.

Eatala Rajendar (Photo Credit : Facebook)

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. కూల్చివేతలు కరెక్టే, శభాష్ రేవంత్ రెడ్డి అని ప్రజలు ఎవరైనా మెచ్చుకుంటే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఈటల అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా మూసీ కూల్చివేతల ప్రాంతాల్లోకి రావాలన్నారు. కూల్చివేతలపై మూసీ ప్రజలు రేవంత్ కు మద్దతిచ్చిన్నా, మెచ్చుకున్నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తానన్నారు ఈటల రాజేందర్. అంతేకాదు రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని చెప్పారాయన.

”సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతాలకు రావాలి. కూల్చివేతలపై ఒక రోజు లేదా 2 రోజులు చర్చ పెట్టండి. కూల్చివేతలు కరెక్టే అని ప్రజలు అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తా. కేసీఆర్ నిజ స్వరూపం ఆరేళ్లకు తెలిస్తే, రేవంత్ నిజ స్వరూపం ఆరు నెలల వ్యవధిలోనే బయటపడింది. సీఎం రేవంత్ అధికారం తలకెక్కి మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఇలానే మాట్లాడారు. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారు. కొంతమంది సన్నాసులు ఏదేదో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. సన్నాసులు మాట్లాడుతున్నారో, ప్రజలు మాట్లాడుతున్నారో తర్వాత కేసీఆర్ కు అర్థమైంది. రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు అర్థం కాదు.

ప్రజలు విపరీతంగా తిడుతున్నారు, విపరీతంగా ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో. నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు. హరీశ్ రావు రాసిస్తే నేను చదువుతానా. అంత దిక్కుమాలిన పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? జ్ఞానం ఉందా? అసెంబ్లీలో నావి వందల స్పీచ్ లు ఉన్నాయి.

ఎవరూ మాట్లాడని నాడు హైడ్రా గురించి మాట్లాడింది నేనే. ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో తిరిగా. నాకు అర్థమైంది.. రేవంత్ రెడ్డి మూర్ఖపు పని చేస్తున్నారు. తనని తాను రాజు, ముఖ్యమంత్రి, చక్రవర్తి అనుకుంటున్నారు. హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చిందే రేవంత్ రెడ్డి. కోర్టు వేసిన మొట్టికాయలు, కామెంట్స్ రేవంత్ రెడ్డికే వర్తిస్తాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వర్తించవు. మౌలాలీ దగ్గర బండ చెరువుకు వెళ్లా. 7వేల 500 ఇళ్లు ఉన్నాయి. అన్నీ లేఔట్లు, కాలనీలు.. 1980 నుంచి ఉంటున్నారు. దాదాపు 60వేల జనాభా ఉంటుంది. ఇవాళ ఎంత బాధపడుతున్నారో. 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను కూలగొడతాం అంటున్నారు. మాకు ఏం గ్రహచారం పట్టింది బిడ్డా.. ఇందుకేనా వారికి ఓట్లు వేసింది” అని వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు.

”మీకు దమ్ముంటే.. వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి రండి. చైతన్యపురి లాంటి కాలనీలకు పోదామా. అక్కడ ఎవరైనా.. శభాష్ రేవంత్ రెడ్డి అని అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చట్టం సిస్టం లేని అరాచక శక్తి మీరు. బై డిఫాల్ట్ సీఎం అయ్యారు. నేను కానీ మా పార్టీ కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు. చెరువులు బాగు చేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. పిట్టల దొరలా మాట్లాడుతున్నారు. సీఎంలా కాకుండా బ్రోకర్ లా మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు. మోసం అబద్ధాలకు మారుపేరు రేవంత్. పచ్చకామెర్లు ఉన్నవాడి లా మమ్మల్ని సన్నాసులు అంటున్నారు” అంటూ సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు ఈటల రాజేందర్.

Also Read : కొండా సురేఖ వివాదం.. హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు