కవిత మరో షర్మిల కాబోతుందా?.. సీఎం రేవంతే ఆ లెటర్ రాయించారేమో.. ఎంపీ రఘునందర్ హాట్ కామెంట్స్

బీజేపీ విషయంలో కవిత వాస్తవాలే మాట్లాడిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

BJP MP Raghunandan

BJP Raghunandan Rao: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ గురించి మీరు తక్కువగా మాట్లాడటంతో భవిష్యత్తు లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతాయన్న ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని పేర్కొన్నారు. అంతేకాక పలు అంశాలపై లేఖలో ఆమె ప్రస్తావించారు. అయితే, ఈ లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 

రాష్ట్ర రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతోందన్న అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. ఇది కుటుంబ పంచాయితీనా..? ఆస్తుల పంచాయతీనా..? వారసత్వ పంచాయతీనా..? అనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని చెప్పుకునే చెప్పారు. దీంతో కవిత కాంగ్రెస్ ఫోల్డర్ లోకి వెళ్ళిందా అనే అనుమానం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితతో లేఖ రాయించారా అనే అనుమానం కూడా కలుగుతోందని రఘునందన్ రావు అన్నారు. ఇటీవల కేటీఆర్, హరీశ్ రావు సమావేశమై కవితను ఒంటరి చేస్తున్నారనే భావనతో తప్పని సరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఫోల్డర్ లోకి వెళ్లారన్న భావన కలుగుతుందని పేర్కొన్నారు.

 

బీజేపీ విషయంలో కవిత వాస్తవాలే మాట్లాడింది. బీజేపీ రోజురోజుకూ తెలంగాణలో బలపడుతుంది. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో ప్రచారం చేసిన విధంగానే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కవితతో ప్రచారం చేయిస్తున్నారు. నాకున్న సమాచారం మేరకు.. కవితతో పార్టీ పెట్టించే అవకాశం ఉంది. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినట్లు కవిత కాంగ్రెస్ అధ్యక్షురాలో లేదా మరోకటి అవుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు.. ఈ మధ్య బీఆర్ఎస్ సిద్దాంతకర్త అని చెప్పుకునే వ్యక్తి చెప్పిన మాటలే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కవిత ఎండార్స్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ రఘునందన్ రావు అన్నారు.