BJP Fee Reimbursement: బీజేపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ లడాయి.. రేవంత్ ప్రభుత్వంపై రాంచందర్ షాకింగ్ కామెంట్స్
BJP Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అని ఎన్.రాంచందర్ రావు(N Ramachandra Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
- V Santhosh Kumar
- Updated on- August 24, 2026 / 04:19 PM IST
Bjp protest over fee reimbursement dues in telangana n ramachandra rao
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వివాదం
- బీజేపీ నిరసన, సంతకాల సేకరణ
- విద్యార్థుల సర్టిఫికెట్ల నిలిపివేత ఆందోళన
BJP Fee Reimbursement: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు(N Ramachandra Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజు బకాయి-బీజేపీ లడాయి’ పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. స్వయంగా విద్యార్థులే తమ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ సంతకాలు చేసి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసనను వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
రూ.12 వేల కోట్లకు చేరిన బకాయిలు, సంక్షోభంలో విద్యా వ్యవస్థ:
రాష్ట్రంలో విద్యా శాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నప్పటికీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు పెడితే, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు దానికి మరో రూ.4 వేల కోట్లు తోడు చేసి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రూ.12 వేల కోట్లకు చేర్చిందని విమర్శించారు. దీనివల్ల దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తూ అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్, తుది వరకు పోరాడతామన్న బీజేపీ:
తన హక్కుల కోసం శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న పాలిటెక్నిక్, ఆయుష్, హోమియోపతి విద్యార్థులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇక్కడి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
