అతి తక్కువ కాలంలో ప్రజలతో ఛీకొట్టించుకున్న ప్రభుత్వం ఇదే- ఈటల రాజేందర్

ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు?

Eatala Rajendar : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు వేయించాలని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఫోన్లు చేసి మంత్రులు హుకుం జారీ చేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. అతి తక్కువ కాలంలో ప్రజలతో ఛీకొట్టించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో నిష్ణాతులు కాంగ్రెస్ నేతలు అని ధ్వజమెత్తారు ఈటల. కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించే నేతలు కాదు, అధికారానికి కొమ్ము కాసే నాయకులు మాత్రమే అని అన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పారు.

‘తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పార్టీ బీజేపీ. 310 జీవోపై గతంలో కాంగ్రెస్ ఆందోళనలు చేసింది. ఇప్పుడు ఆ జీవోపై ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంతవరకు ఆర్టీసీ కార్మికులకు అపాయింట్ మెంట్ లు ఇవ్వలేదు. ఎప్పటివరకు ఆర్టీసీ కార్మికులకు అపాయింట్ మెంట్లు ఇస్తారు? మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటివరకు చెల్లిస్తారు? ఆర్టీసీని పాత పద్ధతిలో దివాళా తీసే స్థితికి తీసుకొస్తున్నారు. రూ.4వేల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? 4వేలు ఇచ్చాకే నిరుద్యోగులను ఓట్లు అడగండి” అని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.

నాడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసమో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చేస్తోంది- ఈటల రాజేందర్
”ఆర్టీసీ కార్మికులు అందరికీ ఒకేసారి జీతాలు ఇవ్వడం లేదు. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ ఉద్యోగులు అనేక రకాలైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. వారిని గుర్తించకపోగా, గౌరవించకపోగా.. చివరికి జీతాలు రాని పరిస్థితి ఉంది. వెంటనే దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో నిరుద్యోగ భృతి విషయంలో కేసీఆర్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతోంది. ఇంతవరకు నిరుద్యోగులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ ఓట్లు అడిగే ముందు నిరుద్యోగులకు రూ.4వేలు ఇవ్వాలి. లేదంటే ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 4వేల రూపాయలు క్లియర్ చేస్తేనే వారిని ఓట్లు అడగాలి.

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 4 డీఏలు రిలీజ్ చేసింది. ఈ విషయంలో ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. ఇంతవరకు డీఏ ఊసే లేదు. ఓట్లు అడిగే ముందు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డీఏలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 జూలై 1 కొత్త పీఆర్సీ అమలు కావాలి. కానీ ఇంతవరకు అతీగతి లేదు. ఉద్యోగులకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి వరకు నాకిచ్చిన చందంగా ఉంది.

Also Read : తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరెవరు?

ట్రెండింగ్ వార్తలు