Minister KTR angry over BJP : ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటన తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ పార్లమెంటునే వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. రెండు సార్లు డీపీఆర్‌లు ఇవ్వడంతో పాటు పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్టు తెలిపారాయన.
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఐటీఐఆర్ ప్రాజెక్ట్ చిచ్చు రాజేసింది. గతంలో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రకటించింది. తాజాగా ఆ ప్రాజెక్టుపై పార్లమెంటులో కేంద్రమంత్రి చేసిన ప్రకటన.. రెండు ప్రభుత్వాల మధ్య పంచాయితీ పెట్టింది. గురువారం పార్లెమెంటులో ప్రసంగించిన సంజయ్ దొత్రే.. డీపీఆర్‌లు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేంద్రమంత్రి పార్లమెంటు సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఐటీఐఆర్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారాయన. 2014లో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని, ఆ తర్వాత పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు డీపీఆర్‌లు పంపిందని తెలిపారు మంత్రి కేటార్. 2016లో అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి తొలిసారి డీపీఆర్ ఇచ్చామన్నారు. 2014 నుంచి రెండు సార్లు డీపీఆర్‌లు ఇచ్చినా కేంద్రం వాటిని పట్టించుకోకుండా.. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తుందన్నారు.