Hyderabad Bomb Threat: హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టారని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. రాజ్ భవన్, సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపారు దుండగులు. దీంతో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు, బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ టీమ్స్. సిటీ సివిల్ కోర్టులో బాంబు స్వ్కాడ్ తనిఖీలు ముగియగా వచ్చింది ఫేక్ బెదిరింపు కాల్ గా గుర్తించారు అధికారులు.
ఇటీవల దేశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వరుసగా బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల శంషాబాద్ ఎయిర్ పోర్టు కావొచ్చు, బేగంపేట ఎయిర్ పోర్ట్ కావొచ్చు..బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తాజాగా సిటీ సివిల్ కోర్టులో దాదాపు ఆరు ప్లేసుల్లో బాంబులు పెట్టామంటూ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ కి మెయిల్ వచ్చింది. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్, బాంబ్ స్వ్కాడ్ టీమ్స్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read: మీరు ట్రాఫిక్ చలాన్లు ఎప్పటికప్పుడు కట్టడం లేదా? మీ డ్రైవింగ్ లైసెన్స్ హుష్ కాకి
దాదాపు మూడు గంటల పాటు సిటీ సివిల్ కోర్టు పరిసర ప్రాంతంలో అణువణువు గాలించారు. ఆ తర్వాత అది ఫేక్ మెయిల్ గా పోలీసులు గుర్తించారు. అబీదా అబ్దులా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి బాంబులు లేవని, అది ఫేక్ మెయిల్ అని పోలీసులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్‌లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. జింఖానా క్లబ్, సివిల్ కోర్టుల్లోనూ సోదాలు జరిపారు. సోదాల సందర్భంగా పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. అది ఫేక్ మెయిల్ అని పోలీసుల చెప్పడంతో అంతా రిలాక్స్ అయ్యారు. కాగా, ఓల్డ్ సిటీలోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు గందరగోళానికి దారితీసింది.
అక్కడ ఉన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు భయంతో బయటకు పరుగులు తీశారు. కోర్టు హాళ్లలో ఉన్న వారందరినీ ప్రాంగణం నుండి ఖాళీ చేయమని కోరడంతో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. మీర్ చౌక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలోని పోలీసు బృందాలు కోర్టుకు చేరుకున్నాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, అధునాతన గుర్తింపు పరికరాలు, స్నిఫర్ డాగ్‌లతో ఆ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది.
ఈ సంఘటనతో కోర్టు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సీనియర్ పోలీసు అధికారులు కోర్టు పాత, కొత్త బ్లాకులను చుట్టుముట్టారు. ఈ కోర్టు.. పాత పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న పురానీ హవేలీలో ఉంది. ప్రస్తుతం ఈ భవనంలో సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఉంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. భయాందోళనలను వ్యాప్తి చేయడానికి కారణమైన వారిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు.