Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ నగరంలో బోనాల సందడి నెలకొంది. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని ఆది, సోమవారాల్లో (ఆగస్టు 9, 10 తేదీల్లో) నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad, Traffic Restrictions

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ నగరంలో బోనాల సందడి నెలకొంది. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకొని ఆది, సోమవారాల్లో (ఆగస్టు 9, 10 తేదీల్లో) నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి బోనాలు, కార్వాన్ దర్బార్ మైసమ్మ, అంబర్‌పేట్ మహంకాళి ఆలయం, చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ – పోచమ్మ ఆలయాల వద్ద తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ప్రయాణంలో అత్యవసర సహాయంకోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ని సంప్రదించవచ్చన్నారు.

Also Read : Telangana Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. ఎల్లో అలర్ట్ జారీ..

లాల్‌దర్వాజాలో..
♦ పాతబస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు, ఊరేగింపు సందర్భంగా ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుంచి ఊరేగింపు ముగిసే వరకు, ఆగస్టు 10న ఉదయం 9 గంటల నుంచి ఊరేగింపు పూర్తయ్యే వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
♦ ఇంజిన్‌ బౌలి, ఫలక్‌నుమా, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు వైపు నుంచి ఆలియాబాద్‌ వైపు వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తారు. నాగుల్‌చింత, సుధా టాకీస్‌, గౌలీపురా, రాజన్నబౌలి, కందికల్‌గేట్‌, బాలాగంజ్‌ తదితర ప్రాంతాల నుంచి లాల్‌దర్వాజా వైపు వచ్చే వాహనాలకు కూడా మళ్లింపు ఉంటుంది.
♦ ఛత్రినాక, ఉప్పుగూడ, చంద్రాయణగుట్ట, ఫతేదర్వాజా, మొఘల్‌పురా, మీర్‌చౌక్‌, యాకుత్‌పురా, పురానీహవేలీ తదితర ప్రాంతాల నుంచి చార్మినార్‌, లాల్‌దర్వాజా వైపు వెళ్లే వాహనాలను వివిధ ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
♦ మదీనా ఎక్స్‌రోడ్స్‌ నుంచి ఇంజిన్‌ బౌలి వరకు గుల్జార్‌హౌస్‌, చార్మినార్‌, చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌, హిమ్మత్‌పురా, నాగుల్‌చింత, ఆలియాబాద్‌ మీదుగా వెళ్లే ప్రధాన రహదారిని ఊరేగింపు పూర్తయ్యే వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేస్తారు.
♦ చాదర్‌ఘాట్‌, నూర్‌ఖాన్‌ బజార్‌, ఎస్‌జే రోటరీ, శివాజీ బ్రిడ్జి నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజియం వైపు వెళ్లే వాహనాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఖిల్వత్‌, మూసాబౌలి నుంచి లాడ్‌బజార్‌ వైపు వెళ్లే వాహనాలకూ మళ్లింపులు ఉంటాయి.
భక్తులకు ప్రత్యేక పార్కింగ్‌.. 
♦ ఆలియాబాద్‌ వైపు నుంచి వచ్చే భక్తులు శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా దేవి ప్లైవుడ్‌ మెయిన్‌రోడ్డుపై సింగిల్‌లైన్‌లో లేదా అల్కా థియేటర్‌ ఖాళీ స్థలంలో వాహనాలు నిలపాలి.
♦ హరిబౌలి, గౌలీపురా వైపు నుంచి వచ్చే భక్తులకు ఆర్యవైశ్య మందిరం, అల్కా థియేటర్‌ ఖాళీ స్థలం, వీడీపీ స్కూల్‌ మైదానం, మిత్రా స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.
♦ ఛత్రినాక వైపు నుంచి వచ్చే వారికి లక్ష్మీనగర్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, పత్తర్‌కీ దర్గా సమీపంలోని ఫూల్‌బాగ్‌ చమన్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. మూసాబౌలి, మీర్‌చౌక్‌ వైపు నుంచి వచ్చే వారు చార్మినార్‌ బస్‌ టెర్మినల్‌లో వాహనాలు పార్క్‌ చేయాలి. ఊరేగింపు వాహనాలకు ఢిల్లీగేట్‌ వద్ద సింగిల్‌లైన్‌ పార్కింగ్‌ ఉంటుంది.
♦ టీజీ, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను చార్మినార్‌, ఫలక్‌నుమా, నయాపూల్‌ వైపు అనుమతించరు. వాటిని పాత సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా ఎక్స్‌రోడ్డు, ఛత్రినాక, ఇంజిన్‌బౌలి వద్ద నిలిపి ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుపుతారు.

కార్వాన్‌లో..
దర్బార్‌ మైసమ్మ బోనాలు, ఏనుగు ఊరేగింపు నేపథ్యంలో కార్వాన్‌లో ఆగస్టు 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 10 ఉదయం వరకు ఇవి కొనసాగుతాయి. ఈ క్రమంలో పురానాపూల్‌ జంక్షన్‌, టప్పాచబుత్రా టీ జంక్షన్‌, యాదవ్‌భవన్‌, ముర్గిచౌక్‌, తల్లాగడ్డ జంక్షన్‌, మొఘల్‌కానాలా తదితర ప్రాంతాల నుంచి దర్బార్‌ మైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు. ఏనుగు ఊరేగింపు కదలికను బట్టి కొన్ని ప్రాంతాల్లో అదనపు మళ్లింపులు చేపడతారు. ఇదిలా ఉంటే.. భక్తుల కోసం కార్వాన్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల మైదానం, తోలిమసీదు ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, జగత్‌సింగ్‌ ప్రైవేటు స్థలంలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. జగత్‌సింగ్‌ స్థలాన్ని ద్విచక్ర వాహనాల కోసం వినియోగించుకోవచ్చు.

అంబర్‌పేట్‌లో..
అంబర్‌పేట్‌లో నేడు, రేపు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉప్పల్, చాదర్‌ఘాట్, రామంతాపూర్, తిలక్‌నగర్, ఎన్‌సీసీ వైపు నుంచి అంబర్‌పేట్ వైపు వాహనాలను అనుమతించరు.

చిలకలగూడలో..
చిలకలగూడలోని శ్రీ కట్ట మైసమ్మ–పోచమ్మ ఆలయం, చిలకలగూడ వద్ద ఆగస్టు 9, 10 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. సీతాఫల్‌మండి జంక్షన్‌ నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్డు వైపు వచ్చే వాహనాలను నామాలగుండు, వారసిగూడ ఎక్స్‌రోడ్డు, సీతాఫల్‌మండి టీ జంక్షన్‌, ఓయూ సిటీ రోడ్డు, తార్నాక ఎక్స్‌రోడ్డు వైపు మళ్లిస్తారు. అదేవిధంగా అల్లుగడ్డబావి, సికింద్రాబాద్‌ నుంచి చిలకలగూడ ఎక్స్‌రోడ్డు మీదుగా సీతాఫల్‌మండి వైపు వెళ్లే వాహనాలను పద్మారావునగర్‌ టీ జంక్షన్‌ వైపు మళ్లించనున్నారు.