Book Fair is Back: ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండగ

పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది.

Book Fair (1)

Book Fair is Back: పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది. అలా ఎన్నో సంగతులు చెప్పే పుస్తకాలు ఒకే దగ్గర వందలు, వేల సంఖ్యలో దొరుకుతే ఇంకేముంది.. పుస్తక ప్రియులకు పండగే పండగ. నగరంలో 10 రోజుల పాటు సాగే పుస్తక పండగ ఎందరో పుస్తక అభిమానుల మన్ననలు పొందుతోంది.

చినిగిన చొక్కా వేసుకో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో అని అంటారు కదా? కంప్యూటర్ యుగంలో.. ల్యాప్‌టాప్ కాలంలో.. ట్యాబ్‌లలో చదువులే ఎక్కువైన పరిస్థితిలో కూడా పుస్తకాలను ఆదరించేవారు ఉన్నారంటే నమ్మగలమా? అవును నిజం.. చదివేవారు.. అమ్మేవారు.. కొనేవారు.. అందరినీ ఒకేచోట చూడాలని అనుకుంటే మాత్రం ఛలో ఎన్టీఆర్ స్టేడియం.

చదవడం ఓ వరం.. పుస్తకం చదువినంతసేపు రచయితతో పాటు కథలోనే కదలాడుతూ ఉండే అవకాశం మనకు ఉంటుంది. అలాంటి ఎన్నో కథనాలు, నాటకాలు, సిద్దాంతాలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, సైన్స్, టెక్నాలజీ, సాహిత్యం.. ఒక్కటేమిటి కొన్ని వేల, లక్షల పుస్తకాలు ఒకే చోట పోగుచేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగలో జాతర వాతావరణమే మనకు కనిపిస్తుంది.

అయితే, గతంలో కంటే భిన్నంగా ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న బుక్‌ ఫెయిర్ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించి మాస్కులు ధరించి రావాలని కోరుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్.. ఇలా 8 భాషలకు చెందిన పుస్తకాలు బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శనలో ఉన్నాయి.

పది రోజుల పాటు సాగే బుక్‌ ఫెయిర్ ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు.. శని, ఆదివారాల్లో, ఇతర పబ్లిక్‌ హాలీడేస్‌లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్ధులు, లెక్చరర్లు ఐడీ కార్డులు చూపిస్తే అనుమతిస్తారు. ఇతరులకు టికెట్లు నామమాత్రంగా ఉండనున్నాయి.