BJP MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ రూపంలో తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నిక సమయంలో రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్‌కు పంపించాలని కూడా సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేశారు.
తెలంగాణ బీజేపీలో చాలా లోపాలు ఉన్నాయని, కొంతమంది పార్టీలో ఎదగకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేయనివ్వలేదని, ప్రెసిడెంట్‌ను ఎవరిని చేయాలో ముందే నిర్ణయించుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. రాజాసింగ్ వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆయన రాజీనామా లేఖను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.
గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజకీయాలకు దూరంగా ఉంటారా.. వేరే పార్టీలో చేరుతారా.. వేరే పార్టీలోకి వెళితే ఏ పార్టీలో వెళ్తారు.. వంటి అంశాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.