Telangana Assembly: అసెంబ్లీ సెషన్స్‌కు రెడీ అవుతోన్న అధికార, విపక్షాలు

కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్‌షీట్‌ను కూడా విడుదల చేసింది బీజేపీ. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. తలా కొన్ని సబ్జెక్టులను తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వ్యూహం రచిస్తోంది కమలదళం.

అసెంబ్లీ సమావేశాలకు అంతా రెడీ అవుతోంది. ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు కూడా అందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. డిసెంబర్ 9 నుంచి జరగనున్న వింటర్ సెషన్‌లో అపోజిషన్‌ను కార్నర్‌ చేసేందుకు అధికారి పార్టీ..ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఈ సారి అసెంబ్లీ సెషన్ కాస్త స్పెషల్‌గా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తాము చేసిన పనులను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపించాలని అధికార పక్షం భావిస్తోంది.

వన్‌ ఇయర్‌లో చేసిన అభివృద్ధిని అసెంబ్లీలో చర్చకు పెట్టబోతుందట. ఏడాది కాలంలో రైతాంగానికి 58 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు సభా వేదికగా వివరిస్తారట. 52 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని కూడా చెప్పుకోవాలనుకుంటోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. వీటితో పాటు విద్య, వైద్యం అన్ని శాఖల్లో జరిగిన అభివృద్ధిపై వివరిస్తారట. అంతేకాదు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులు..వాటి వడ్డీలు ఇలా అన్ని లెక్కలు అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు పెడుతామంటున్నారు హస్తం నేతలు.

బీఆర్ఎస్‌ వ్యూహం
అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలను గత సెషన్‌ కంటే బెటర్‌గా యూజ్‌ చేసుకోవాలని భావిస్తోంది ప్రతిపక్షం బీఆర్ఎస్. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై నిత్యం పోరాడుతూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ. అసెంబ్లీ వేదికగా ఆరు గ్యారెంటీలపై గట్టి పట్టు పట్టాలని చూస్తుంది. రుణమాఫీలో లోపాలను వివరించడంతో పాటు ..ఇంకా ఎంతమందికి లోన్ మాఫీ కాలేదో లెక్కలతో సహా వివరించేందుకు రెడీ అవుతోందట.

ఇక రైతుబంధుపై కూడా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని భావిస్తోంది బీఆర్ఎస్. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్‌ ఘటనలను ప్రస్తావించనున్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీపై కూడా నిలదీస్తామంటున్నారు గులాబీ నేతలు. పారిశ్రామిక విధానం, మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

బీజేపీ వ్యూహం
మరో ప్రతిపక్షం బీజేపీ కూడా అధికార పార్టీని నిలదీయాలని భావిస్తోంది. ఇప్పటికీ ఆరు గ్యారెంటీలకు సంబంధించి.. 66 అబద్ధాలు అంటూ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై చార్జ్‌షీట్‌ను కూడా విడుదల చేసింది బీజేపీ. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. తలా కొన్ని సబ్జెక్టులను తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వ్యూహం రచిస్తోంది కమలదళం.

అయితే ప్రతిపక్షాలు ఏయే అంశాలు లేవనెత్తే అవకాశం ఉందో ఇప్పటికే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా సమాధానాలు, అవసరమైతే ఎదురుదాడికి కూడా వెనకాడొద్దని వ్యూహ రచన రెడీ చేస్తోందట. బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా శ్వేతపత్రాలు విడుదల చేశారో..అవసరమైతే ఈసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు.

మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని..పదేళ్ల కాలంలో ఒక గ్రూప్-1ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ఇలా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని అనకుంటుందట కాంగ్రెస్ ప్రభుత్వం. పొలిటికల్‌గా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టాలని ప్లాన్ సిద్ధం చేస్తుందట. ఇలా ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సెషన్‌ హాట్‌ హాట్‌గా కొనసాగే అవకాశం ఉంది. అయితే శాసనసభ సమావేశాలకు ప్రధాని ప్రతిపక్ష నేత, గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్‌గానే కొనసాగుతోంది.

CM Revanth Reddy: రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..