CM Revanth Reddy: రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..

ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇక రెండో ఏడాదిలో అయినా అన్ని లక్ష్యాలను సాధించాలని ఫిక్స్ అయిపోయిందట రేవంత్ సర్కార్.

CM Revanth Reddy: రెండో ఏడాదిలో పాలనను పరుగులు పెట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్..

CM Revanth Reddy

Updated On : December 3, 2024 / 9:00 PM IST

ప్రభుత్వాన్ని నడపటం అంటే ఆశామాషీ కాదు. ప్రతీ అధికారి చెప్పినట్లుగానే వర్క్ చేసుకుంటూ పోతేనే అనుకున్న లక్ష్యాలు సాధించొచ్చు. కానీ రేవంత్‌ సర్కార్‌లోని కొందరు అధికారుల్లో ఒకరు ఈస్ట్ అంటే మరొకరు వెస్ట్ అంటున్నారట. ప్రభుత్వం ఒకటి చెప్తే తామొకటి చేస్తున్నారట. ఇన్నాళ్లు చూస్తూ వదిలేసిన సీఎం..వన్‌ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాక..కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.

ప్రతి చిన్న విషయానికి తాను చెప్తే తప్ప పనిచేయడం లేదని పలువురు IASల పనితీరుపై గుర్రుగా ఉన్నారట సీఎం. ఇక చేసేదేం లేదు ప్రక్షాళన చేపడుదామని ఫిక్స్ అయిపోయారట. కీలక శాఖల్లో ఉన్నత హోదాల్లో ఉండి సరిగ్గా పనిచేయని అధికారులను మార్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

వాళ్ల పొజీషన్‌లో ఎవరినీ తీసుకోవాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ పది రోజుల్లోనే సెక్రటేరియట్‌లోని కీలక శాఖల అధికారుల మార్పులు, చేర్పులు ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ అధికారికి ఏం పోస్ట్ దక్కబోతుంది.? ఇప్పుడున్న పోస్ట్ కంటే తక్కువ పోస్ట్‌కు వెళ్లేదెవరు.? ఏ అధికారి అందలమెక్కబోతున్నారు.? లూప్‌ లైన్‌లోకి వెళ్లేదెవరనే చర్చ సెక్రటేరియట్‌లో హట్ టాపిక్‌ మారింది.

అధికారుల తీరే కారణమా?
సమీక్షల్లో సీఎం ఓ డైరెక్షన్‌లో ఆర్డర్స్‌ ఇస్తే ఔట్ పుట్ మాత్రం ఇంకోలా వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వంపై ప్రజల్లో అనుకున్నంత సానుకూలత లేకపోవడానికి అధికారుల తీరే కారణమన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో పనిచేసినట్లు పలువురు అధికారులు సమర్ధవంతంగా పనిచేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీఎంవోతో పాటు పలు శాఖల్లో ఉన్నతాధికారులు సమర్ధవంతంగా పనిచేయడం లేదట. ఏదైనా అడిగితే ఏదో కారణం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇదే సీఎం రేవంత్‌ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అందుకే అందరినీ మార్చేయండి..పనిచేసే వాళ్లనే కీలక శాఖల్లో పెట్టండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేశారట ముఖ్యమంత్రి.

ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలపై అధికారులు దృష్టి పెట్టడం లేదట. కొత్తగా ఆదాయం పెంపు సంగతి పక్కన పెడితే..రెగ్యులర్‌గా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే పడిపోయిందట. అయినా అధికారుల్లో చలనం కనిపించడం లేదని ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం విషయంలో కూడా అధికారులు ప్రభుత్వాన్ని ముందే అలర్ట్ చేయలేదంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం.

కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఉద్యమం చేసింది అదే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ విషయాలను ఉన్నతాధికారులెవరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదట. దీంతో చివరికి ఇథనాల్ ఫ్యాకరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అధికారులు పట్టనట్లు వ్యవహరించడం వల్లే..ప్రభుత్వం బద్నాం కావాల్సి వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు.

లగచర్ల ఘటన కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే?
ఇక లగచర్ల ఘటన కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. భూసేకరణ విషయంలో ముందుచూపుతో వ్యవహరించకుండా..కలెక్టర్‌పై దాడి జరిగే వరకు వ్యవహారం వెళ్లింది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని, ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే సర్కార్ వెనకడుగు వేయాల్సి వచ్చేది కాదంటున్నారు.

ఇదే క్రమంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం ఉందన్న అభిప్రాయంలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఒక ఘటన జరగ్గానే వెంటనే రియాక్ట్ అయి చర్యలు తీసుకుంటే ఇష్యూ పెద్దది అయ్యేది కాదని..కానీ తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరించడం వల్లే పరిస్థితి చేయిదాటిపోయే వరకు వచ్చిందంటున్నారు. వీటన్నింటికీ ప్రభుత్వ నిర్ణయాలు ఓ కారణమైతే..అధికారుల పనితీరు సరిగ్గా లేకపోవడమే కారణమన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ జరిగిపోయింది. ఇక రెండో ఏడాదిలో అయినా అన్ని లక్ష్యాలను సాధించాలని ఫిక్స్ అయిపోయిందట రేవంత్ సర్కార్. అందుకే బాధ్యతాయుతంగా పనిచేయని అధికారులను ఉపేక్షించొద్దని..ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకునే బదులు..మరో అధికారితో పనిచక్కబెట్టుకోవాలని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఏ అధికారి బదిలీ అవుతారో..ఎవరికి లూప్‌ లైనే దిక్కవుతుందో చూడాలి మరి.

Kakinada port: ఇక నుంచి నిఘా నీడలో కాకినాడ పోర్టు.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా భద్రత?