KCR : ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ 10మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహం..!

అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

KCR : పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆయన చర్చించారు. రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలిపేలా కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహం పై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టి సరిపుచ్చుకోవాలా, లేక రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇరుకున పెట్టాలా? అనే అంశంపై పార్టీ నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంది. ఆలోపే ఒక నిర్ణయానికి రానున్నారు కేసీఆర్.

Also Read : మామునూరు ఎయిర్ పోర్ట్.. ప్రభుత్వం ఎందుకు టెన్షన్ పడుతోంది? ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మినహాయిస్తే 28 ఎమ్మెల్యేల బలం బీఆర్ఎస్ కు ఉంది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే కచ్చితంగా 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నందున.. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి మాత్రమే అవకాశం ఉంది. కానీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలంటే, ఆ ఎమ్మెల్యేలు ఎటువైపు ఓటు వేస్తారో తెలుసుకోవాలంటే కచ్చితంగా రెండో అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నలుగురిని బరిలోకి దింపి, బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపితే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, బీఆర్ఎస్ పార్టీ రెండో అభ్యర్థిని నిలిపితే.. అప్పుడు కచ్చితంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం బీఆర్ఎస్ కు ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో పార్టీ మారిన ఆ 10మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ కు ఓటు వేస్తారా లేక బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా అన్నది తేలే ఛాన్స్ ఉంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read : ప్రమాదపు అంచున శ్రీశైలం ప్రాజెక్ట్..? ఏపీ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ కీలక ఆదేశాలు

ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా ఎండగట్టాలి, ఏయే అంశాలను బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాలి అన్న అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.