Kcr : అందుకోసమే.. భగవంతుడు నన్ను పుట్టించాడు- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.

Kcr : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. బస్సు యాత్రలు, రోడ్ షోలతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలతో వారిని టార్గెట్ చేస్తున్నారు. భువనగిరి రోడ్ షో లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.

‘బీజేపీ పదేళ్లు పరిపాలన చేసినా ఎవరికీ న్యాయం జరగలేదు. దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మోదీ ప్రభుత్వం నింపడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలఫై దాడులు జరుగుతున్నాయి. రూపాయి విలువ దేశ చరిత్రలో 83 రూపాయల హీన స్థితికి దిగజారింది. ఒక పార్టీ దేవుని పేరుతో, ఇంకో పార్టీ ఒట్టు పెట్టుకుని ఓట్లు ఆడుకుంటున్నారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ-టీం అంటున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ కలిసి మున్సిపల్ పీఠం ఎక్కాయి. అక్షింతలు, తీర్థాలు, పులిహోరలు పొలాలకు నీళ్లు తెస్తాయా?

నా తల తెగిపడ్డా నా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని ప్రధాని మోదీతో చెప్పా. నవోదయ పాఠశాల ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. కొట్లాడి ఎయిమ్స్ తెచ్చుకున్నాం. 400 మెగా వాట్ల సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకు ఇచ్చారు. బీజేపీతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీతో 58 ఏళ్లుగా గోస పడ్డాము. మిమ్మల్ని నమ్ముకుని ఉద్యమం చేశా. 15ఏళ్లు కొట్లాడి చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చినా. స్వరాష్ట్రములో తల్లి కోడిలాగా మిమ్ములను కాపాడుకున్నా. కరెంట్, నీళ్లు, నియామకాలు ఇచ్చాం. ధాన్యంకు మద్దతు ధర ఇచ్చి నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసినము.

కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, ధాన్యం బోనస్ బోగస్ అయ్యింది. ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే కాడ పంచాయితీ పెట్టిండు. బోరు బండ్లు, క్రేన్ లు ఊళ్ళలోకి వచ్చినయ్. మిలర్ల దగ్గర కమిషన్లు తిని కొనుగోళ్లు గోల్ మాల్ చేసిండ్రు. కేసీఆర్ పక్కకు జరగంగానే కటక వేసినట్టే కరెంటు పోయింది. రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. రైతు భీమా అపహాస్యం అయ్యింది. కాంగ్రెస్ పాలనలో ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు. చేనేత బతుకులు బాగు చేసినం. నిరుద్యోగులకు భృతి, జాబ్ క్యాలండర్ లేదు.

యాదాద్రి నరసన్న మీద ఒట్టు పెట్టి పోయిండ్రు. రుణమాఫీఫై కాంగ్రెసొళ్ళు మాట మార్చిండ్రు. 420 అబద్దపు హామీలు చెప్పిండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయ? మహిళలకు 2500 వచ్చినాయ? తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కు పంచాయితీ పడింది. భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. తెలంగాణకు.. సమైక్య వాదుల విముక్తి కలగాలి. బీఆర్ఎస్ ఓడిపోయినా నాకు బాధ లేదు. లక్షల మంది బీఆర్ఎస్ క్యాడర్ తో ప్రజల కోసం పోరాడతా. భూమి, ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేస్తా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేరాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామా మల్లేష్ పట్టుదల, అనుభవం ఉన్న నాయకుడు. ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు’ అని కేసీఆర్ అన్నారు.

Also Read : బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ, కారు ఇక తూకానికే- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు