Cm Revanth Reddy : బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ, కారు ఇక తూకానికే- సీఎం రేవంత్ రెడ్డి

4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.

Cm Revanth Reddy : బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ, కారు ఇక తూకానికే- సీఎం రేవంత్ రెడ్డి

Cm Revanth Redd Fires On Brs

Cm Revanth Reddy : తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. నేతలు సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. బీజేపీ, బీఆర్ఎస్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్ లపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు.

రాజేంద్రనగర్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ లను కార్నర్ చేశారు. ”పదేళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానాకు పంపారు. కార్ఖానాకు వెళ్లిన కారు ఇక సరాసరి తూకానికే. కారు పనైపోయిందని ఇవాళ కేసీఆర్ బస్సు వేసుకుని బయలుదేరారు. కేసీఆర్ బస్సు యాత్ర వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధ యాత్రలకు వెళ్లినట్లుంది. 4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. కేసీఆర్ ఊరూరు తిరిగినా.. ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కున్నా.. తెలంగాణ సమాజం ఆయన్ను నమ్మదు.

పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ.. ఇచ్చింది కేవలం 7లక్షలు మాత్రమే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోసం చేశారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ.. పదేళ్లయినా 15 పైసలు కూడా వేయలేదు. బీజేపీ వాళ్లు నమో అంటున్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీసీ జనగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. అందుకే బీజేపీ భయపడి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తుంది. బీజేపీ.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది.

వ్యాపారం ముసుగులో బ్రిటీషర్లు ఇండియాను ఆక్రమించుకున్నారు. సూరత్ నుంచే బ్రిటీష్ ఆక్రమణ మొదలైంది. బీజేపీ ఈస్టిండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటీష్ జనతా పార్టీ. వాళ్ల ఎజెండా బ్రిటిష్ ఎజెండా. వాళ్ల ఎజెండా రిజర్వేషన్లు రద్దు చేయడం. కాంగ్రెస్ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం, రిజర్వేషన్లు అమలు చేయడం.

అందరి అభిప్రాయాలతోనే చేవెళ్లలో రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాం. మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలి. పార్లమెంటులో మాట్లాడాలి. చేవెళ్ల అభివృద్ధి జరగాలంటే రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలి.

బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుంది. బీజేపీ నేతలు దేవుడిని అడ్డు పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ, అమిత్ షా చెబుతున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి.. దీనిపై మీ విధానమేంటో చెప్పండి. మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది… దాన్ని కలుషితం చేయొద్దు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : హోల్ సేల్‌గా దేశాన్ని ముస్లింలకు అప్పగిస్తాం అంటున్నారు- కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ ఫైర్