లోక్‌సభ ఎన్నికల వేళ.. తెలంగాణలో ప్రాజెక్టుల ఫైట్‌.. కాళేశ్వరం చుట్టూ రాజకీయం

Kaleshwaram: పార్లమెంట్‌ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్న అధికార, విపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల అజెండాను సెట్‌ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Water War

నీళ్ల నుంచి నిప్పులు.. ప్రాజెక్టుల సాక్షిగా పంచాయితీలు.. తప్పు చేశారని ఒకరంటే… లేనిది ఉన్నట్లు చూపుతున్నారని మరొకరు… మాటకు మాట… దెబ్బకు దెబ్బ… ఇరువైపులా మాటల యుద్ధమే.. బస్తీ మే సవాల్‌… తేల్చుకుందాం రా.. అబ్బో తెలంగాణ రాజకీయం గరం గరంగా మారుతోంది. కుంగిన పిల్లర్లే కాంగ్రెస్‌ ఆయుధమైతే…. ఎన్నికల స్టంట్‌ ఆపండంటూ బీఆర్‌ఎస్‌ కూడా ఎదురుదాడి స్టార్ట్‌ చేసింది. ఇటు అధికార పక్షం.. అటు విపక్షం ఒకేరోజు ప్రాజెక్టుల బాట పట్టడం తెలంగాణ రాజకీయాన్ని వేడిక్కించింది.

తెలంగాణలో ప్రాజెక్టుల ఫైట్‌ హీట్‌పుట్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకుంటున్న రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగిన మేడిగెడ్డ బ్యారెజ్‌ పిల్లర్లు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారుతున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్షంపై దాడికి ప్రధాన ఆయుధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎంచుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ తర్వాతా అదేవ్యూహాన్ని అమలు చేస్తోంది.

బీఆర్‌ఎస్‌ సర్కార్‌లో నిర్లక్ష్యంతో చేసిన పనులే మేడిగడ్డను ముంచేశాయని ఆరోపిస్తోంది కాంగ్రెస్‌ ప్రభుత్వం… ఇన్నాళ్లు ప్రభుత్వ దాడిని ఎదుర్కొంటూనే… ప్రతి విమర్శకు సమాధానమిచ్చిన బీఆర్‌ఎస్‌… ఎంతకూ అధికారపక్షం దారిలోకి రాకపోవడంతో రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా? కుంగిన పిల్లర్లను పునరుద్ధరించకుండా పాలిట్రిక్స్‌ప్లే చేస్తున్నారంటూ చలో మేడిగడ్డ అంటూ వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసింది.

అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ఎస్
గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, శాసనసభ్యులు ఎలా అయితే మేడిగెడ్డకు వెళ్లివచ్చారో…. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కూడా అదేస్థాయిలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో మేడిగడ్డకు వెళ్లింది. 86 పిల్లర్లకు మూడు కుంగిపోతే నానా యాగీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ చలో పాలమూరు-రంగారెడ్డి పేరిట పోటీ కార్యక్రమం చేపట్టడంతో రాజకీయం మరింత రసకందాయంగా మారింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శ్రీహరి ముదిరాజ్‌, మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వీరపల్లి శంకర్‌, అనిరుధ్‌రెడ్డి వంటివారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి….. గత సర్కార్‌ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

రెండు పార్టీలు నేతలు ఒకే రోజు
విపక్షం చలో మేడిగడ్డ అంటూ ఉత్తర తెలంగాణ బాట పడితే… అధికార పక్షం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాట పట్టి దక్షిణ తెలంగాణలో పర్యటించింది. ఇలా రెండు పార్టీలు నేతలు ఒకే రోజు ప్రాజెక్టుల సందర్శన పేరుతో వాటర్‌వార్‌కు దిగారు. విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ పొలిటికల్‌ టెంపరేచర్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొత్తానికి తెలంగాణ రాజకీయం గరం గరంగా మారిపోయింది.

పార్లమెంట్‌ ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్న అధికార, విపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల అజెండాను సెట్‌ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టార్గెట్‌ 14 పెట్టుకున్న కాంగ్రెస్‌.. గత సర్కార్‌ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని, నీళ్లను సద్వినియోగం చేసుకోలేదని… కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకూ పనికి రాకుండా చేశారని ఆరోపిస్తూ ప్రజల్లోకి దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది.

అయితే బీఆర్‌ఎస్‌ కూడా దీటుగానే ఎదుర్కొంటోంది. 600 అడుగుల లోతు నుంచి నీటిని ఎత్తిపోసి రైతులకు మేలు చేసిన తమ పార్టీని తప్పుబడుతున్నారని…. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన దానికన్నా ఎక్కువ నష్టం జరిగిందని చూపుతున్నారని మండిపడుతోంది. ఇలా రెండు పార్టీలూ ప్రాజెక్టువార్‌తో తగ్గేదేలే అంటున్నాయి. రెండు పార్టీల్లో ఎవరి వాదన నెగ్గుతుందోగాని.. వచ్చే ఎన్నికల్లో ప్రాజెక్టుల ఫైటింగే ప్రధానాంశం కాబోతోంది.

Read Also: అందుకే జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీలో చేరాను: చేగొండి సూర్యప్రకాశ్

ట్రెండింగ్ వార్తలు