Harish Rao open letter to CM Revanth Reddy
Harish Rao open letter to CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల వందలాది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని హరీశ్ రావు అన్నారు.
Also Read: Cough Syrup : ఆ దగ్గు సిరప్‌తో జాగ్రత్త.. వెంటనే ఆపేయండి.. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో మొత్తం 1,801 పీజీ సీట్లు ఉన్నాయి. వీటిలో 50శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళ్తాయి. మిగిలిన 50శాతం రాష్ట్ర కోటాలో ఉండే సీట్లలో 25 శాతం (సుమారు 450 సీట్లు) మేనేజ్మెంట్ కోటాగా ఉంటాయి. అయితే ఈ సీట్లలో స్థానిక రిజర్వేషన్ అమలు చేయకపోవడంతో మొత్తం సీట్లు ఆల్ ఇండియా విద్యార్థులకు వెళ్ళిపోతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఏపీలో 85శాతం లోకల్ రిజర్వేషన్ ఉంటే తెలంగాణలో శూన్యం! ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ విద్యార్థులు 382 సీట్లు కోల్పోతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రక్షణాత్మక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85శాతం స్థానిక రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని,
ప్రస్తుతం విడుదల చేసిన పీజీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను తక్షణం రద్దు చేయాలని, కొత్త జీవో జారీ చేసి, తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేలా స్పష్టమైన విధానం రూపొందించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.