వరంగల్ వేదికగా రజతోత్సవ సభకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ.. 2022 అక్టోబరు 5న బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది.
తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ పార్టీ పుట్టుకతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాన్ని సాధించడానికి రాజకీయ వేదిక లభించింది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ఉద్యమాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని స్థాపించారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యంతో కేసీఆర్ స్థాపించిన టీఆర్‌ఎస్ అందులో సఫలమైంది. తెలంగాణ ప్రాంతానికి ఉన్న విభిన్నమైన భాష, యాస, సంస్కృతి, ఈ ప్రాంత అవసరాలను అప్పటి ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో, తెలంగాణకు బలమైన రాజకీయ వేదిక కావాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ ఏర్పాటైంది.
“తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దాడుతా”.. ఇదీ నాడు.. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా అవసరమైతే ఎంతవరకైనా వెళ్తానని చెప్పేందుకు ఆయన అన్న ఈ మాటలే ఉదాహరణ. తెలంగాణ ఉద్యమంలో సకల జనులూ పాల్గొన్నారు. కానీ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ప్రత్యేకమనే చెప్పాలి. ఉద్యమం, రాష్ట్రసాధన తర్వాత అధికారం.. ఇప్పుడు ప్రతిపక్షం..
ఇలా ఎన్నో దశల్ని చూసింది బీఆర్ఎస్. ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. 2001.. ఏప్రిల్ 27.. హైదరాబాద్‌లో ఓ చరిత్రకు నాందీగీతం పలికిన రోజు .. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి పునాది పడ్డ రోజు.. జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రకటన చేసిన రోజు..
పదవుల్ని వదిలి ఉద్యమబాట
నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఈ అంశాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని గళమెత్తారు కేసీఆర్. 2001లో పార్టీ పెట్టే సమయానికి టీడీపీ సర్కార్‌లో రవాణాశాఖమంత్రిగా ఉన్నారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ చేశారు. సమైక్య పాలనలో తెలంగాణపై వివక్ష, జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ.. పార్టీని, పదవుల్ని వదిలి ఉద్యమబాట పట్టారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యం వద్ద తెలంగాణ రాష్ట్రసమితి ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ పేరు చెబితేనే గుర్తొచ్చేది ఉద్యమంతో పాటు రాజీనామాలు, ఉప ఎన్నికలే. 2001 సెప్టెంబర్‌లో సిద్ధిపేట నుంచి టీఆర్ఎస్ గెలుపుతో ఉద్యమనేతగా కేసీఆర్ విజయప్రస్థానానికి అడుగులు పడ్డాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 54 సీట్లలో 26 గెలిచారు. నాటి ఏఐసీపీ అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో ఈ అంశాన్ని చేర్చారు. దీంతో తెలంగాణ సాధనకు ఆశలు చిగురించాయి.
టీఆర్ఎస్ ఐదు ఎంపీ స్థానాల్లో గెలవగా.. కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్రమంత్రులయ్యారు. తర్వాత యూపీఏ ప్రభుత్వం నాన్చుడు ధోరణికి విసిగి ఆ పదవులకు రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికల్లో 16 స్థానాల్లో 7 సీట్లు, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 45 స్థానాల్లో 10 మాత్రమే గెలుచుకుంది టీఆర్ఎస్. 2010 ఉప ఎన్నికలో 11 కు 11 స్థానాలు గెలిచింది. 2011 ఉప ఎన్నికల్లో ఒక స్థానం, 2012లో ఐదు స్థానాలు గెలిచారు. ఇలా.. రాజీనామాలు, ఉప ఎన్నికలు.. విజయాలు.. టీఆర్ఎస్ ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.
యూపీఏ హయాంలో ఇలా..
యూపీఏ హయాంలో 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన ఆమరణ నిరాహారదీక్ష .. ఆ పార్టీకి కీలక మలుపు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న తెగింపు నినాదంతో ప్రాణాల్ని పణంగా పెట్టి ఆమరణదీక్షకు దిగడం అప్పట్లో సంచలనం. 2009 అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించింది టీఆర్ఎస్. దీక్ష భగ్నం చేసి ఖమ్మంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడే ఆమరణదీక్ష కంటిన్యూ చేశారు కేసీఆర్. 11 రోజులు నిరవధికంగా దీక్ష చేయడంతో కేంద్రం దిగొచ్చి డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసింది.
అటు సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. కేంద్రం యూటర్న్ తీసుకుంది. దీంతో రాజకీయ జేఏసీ రంగంలోకి దిగింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వం వహించగా.. అందులోనూ టీఆర్ఎస్ యాక్టివ్ రోల్ పోషించింది. 2010 వరంగల్ మహాగర్జన సభ విజయవంతం .. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, విద్యార్థుల ఆందోళనలు.. ఇలా ఉద్యమపార్టీగా టీఆర్ఎస్ ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేసినా.. తెలంగాణ సమాజం బాసటగా నిలిచి.. ఉద్యమానికి ఊపిరులూదింది. విద్యార్థుల ఆత్మహత్య ఘటనలతో తెలంగాణ అట్టుడికింది. 2014 ఫిబ్రవరి 14న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జూన్ 2న నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
తెలంగాణ వచ్చిన తర్వాత..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. ఇక కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనుకున్నారు. కానీ.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసి ప్రభంజనం సృష్టించింది. 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి 63 సీట్లు దక్కించుకుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. రైతుబంధు, రైతు రుణమాఫీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, దళిత బంధు.. ఇలా పలు స్కీమ్స్‌ను తెలంగాణలో అమలు చేశారు. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లి 89 స్థానాల్లో గులాబీ జెండా పాతింది. 2018 డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
అదే ఏడాది కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేశారు కేసీఆర్. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. 17 ఎంపీ స్థానాల్లో 9 మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీలు రేస్‌లోకొచ్చాయి. దీంతో పంథా మార్చారు కేసీఆర్. జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీగానే దెబ్బకొట్టాలన్న ప్లాన్‌తో భారత రాష్ట్రసమితిగా పార్టీ పేరు మార్చారు. కానీ.. 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. 16 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా కారు జోరు రాష్ట్రంలో ఎక్కడా కనబడలేదు. అదే టైంలో ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు కేసీఆర్.
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం మినహా.. అసెంబ్లీ సెషన్స్‌కు రాకపోవడం, ప్రతిపక్షనేతగా యాక్టివ్ మోడ్‌లోకి రాకపోవడంతో.. గులాబీ శ్రేణుల్లో ఎప్పుడూ లేనంత నైరాశ్యం అలుముకుంది. కారుగుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి.. అధికారపార్టీలో చేరడంతో అంతా డైలమాలో పడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా.. క్యాడర్‌లో జోష్ నింపేందుకు పాతికేళ్ల రజతోత్సవ వేడుకలు కేసీఆర్‌ను పొలిటికల్‌గా మరో పేరుతో కొత్త ఫేజ్‌లోకి తీసుకెళ్లాయనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.