CM Revanth Reddy
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఎథిక్స్ కమిటీకి పంపి అవసరమైతే జగదీశ్‌రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. ఈ వ్యవహారంపై అసెంబ్లీ లాబీలో రకరకాల గుసగుసలు వినిపిస్తునన్నాయి.
అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ చేసింది జగదీశ్‌రెడ్డిని కాదన్న చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో మరో ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తే అనుకోకుండా జగదీశ్ రెడ్డి వచ్చి ఇరుక్కున్నారని చెబుతున్నారు. అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి ఎపిసోడ్ జరక్కముందే రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ఓ పథకం ప్రకారం ముందుకు వెళ్తోందన్న టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. సభలో ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేల వ్యవహారశైలిని ఏడాదిన్నర పాటు చూశారని, గొడవ చేసినా, ప్రతిసారి పోడియం దగ్గరకు వెళ్లినా చూసీ చూడనట్టు వదిలేశామని అన్నారట.
అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రియాక్షన్ ఉండాలని చెప్పడంతో పాటు..పాలకపక్షంగా కఠినంగానే ఉండాలని నిర్ణయించారట. సభా వ్యవహారాలకు అడ్డుతగిలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. సీఎల్పీ సమావేశం మరుసటి రోజే అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డి ఎపిసోడ్ జరిగింది. తర్జనభర్జన తర్వాత జగదీశ్‌రెడ్డిని ఈ బడ్జెట్ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా..అధికార కాంగ్రెస్ టార్గెట్ తప్పిందన్న చర్చ మొదలైంది. రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని టార్గెట్‌గా పెట్టుకుంటే..మరొకరు బలయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత అసెంబ్లీ సెషన్ నుంచి సభలో వ్యవహరిస్తున్న తీరుపట్ల స్పీకర్ ప్రసాద్ కుమార్‌తో పాటు మంత్రులు చాలా రోజులుగా అసహనంతో ఉన్నారని తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారన్న టాక్
గత సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలికి సంబంధించిన వీడియోలు విడుదల చేసిన స్పీకర్, ఈ సారి వైఖరిలో మార్పు రాకపోతే శాసనసభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకని బీఆర్ఎస్‌లో మిగతా వారి కంటే కూడా సభలో దూకుడుగా వ్యవహరిస్తున్న కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ బడ్జెట్ సెషన్‌లో కూడా అలాగే ప్రవర్తిస్తే ఆయనపై వేటు వేయాలనే యోచనలో ఉందట కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా అనుకోకుండా జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్ తీసుకున్న ప్రభుత్వం.. ఆయనను సస్పెండ్ చేసింది.
అయినా తమ టార్గెట్ రీచ్ అయ్యే వరకు తగ్గేదేలే అన్నట్లుగా ఉందట అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఫోకస్ పెట్టారట. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులూ సభలో కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడినా అలర్ట్‌గా ఉండాలని, ఏ మాత్రం నిబంధనలను అతిక్రమించినా, అనుచితంగా ప్రవర్తించినా.
స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎదురు చూస్తోందన్న చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడంతో ఎమ్మెల్యేలంతా అలర్ట్ అయ్యారని, ఏ చిన్న అవకాశం వచ్చినా కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ సభ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టి పట్టుదలతో ఉన్నారని టాక్. దీంతో ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.