BRS Leaders Arrest : రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు (BRS Leaders Arrest) చేశారు.
శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ వాయిదా అనంతరం హరీశ్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణం నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి యూరియా కొరతను నిరసిస్తూ ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బయటకుకొచ్చి యూరి కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు, నేతలు ఆందోళనకు దిగారు.
యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది.. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడినుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాకోసం రైతులు రోడ్లెక్కి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావులతోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.
సచివాలయం వద్ద హైటెన్షన్..
ఆ తరువాత హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పరుగెత్తుకుంటూవెళ్లి తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. యూరియా కొరత తీర్చాలంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు సచివాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.