TS Assembly: భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్.. కేటీఆర్ ఏమన్నారంటే?

కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.

KTR Bhatti

TS Assembly: కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. సోమవారం స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ సభ్యులు.. శాసన సభలో 168(1) నిబంధన ప్రకారం బీఆర్ఎస్ తరపున ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పై నోటీసులు ఇచ్చారు. అప్పులు, వడ్డీల విషయంలో తెలంగాణ ప్రజలను, శాసనసభలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. కీలక వ్యాక్యలు చేశారు.

Also Read: Mohan Babu : మంచు కుటుంబం పై 3 FIR లు.. ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు..

కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మేము స్పీకర్ ను కలిసి ఆర్థిక శాఖ మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘనగా నోటీసు ఇస్తే చర్చకు వచ్చింది. అదేవిధంగా ప్రొటోకాల్ సమస్యలను స్పీకర్ కు విరించాం. లగచర్ల పై చర్చకు స్పీకర్ ను కోరాం. బీఏసీలో కూడా ఈ అంశం లేవనెత్తుతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. రాష్ట్ర అప్పులు 3.89 లక్షల కోట్లు అని స్పష్టత ఇచ్చింది. కానీ, అసెంబ్లీ వేదికగా అప్పులపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. గతంలో సీఎంపై మేము ఉల్లంఘన నోటీసులు ఇచ్చాం. దీన్ని నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసు అడ్మిట్ చేశారు. ఆర్థిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మేము కోరుతున్నాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

 

మరోవైపు లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపి నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని శాసనసభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.