బీఆర్ఎస్ నయా ప్లాన్..! ఆ వర్గానికి దగ్గరయ్యేలా ప్రణాళిక..

సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేసేందుకు ఇదొక అస్త్రంగా గులాబీ పార్టీ భావిస్తోంది.

Brs New Strategy (Photo Credit : Google)

Brs New Strategy : గిరి పుత్రులకు గులాబీ పార్టీ గాలం వేస్తోందా? లగచర్ల ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం రూపొందిస్తోందా? తాజా పరిణామాలు గమనిస్తే గిరిజనులకు దగ్గరయ్యేలా గులాబీ పార్టీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారని ఫలితాల అనంతరం విశ్లేషించుకున్న బీఆర్ఎస్.. లగచర్ల ఘటనతో గిరిజన వర్గాలతో మమేకం అయ్యేలా ప్లాన్ అమలు చేస్తోందని తెలుస్తోంది. బాధితులకు అండగా ఉండేలా గులాబీ పార్టీ కార్యాచరణను అమలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

దాదాపు ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు గులాబీ పార్టీపై ఆగ్రహంతో వ్యవహరించారు. గిరిజన ప్రభావం ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఎక్కడా గెలవలేదు. పార్లమెంటు ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. గిరిజన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా మద్దతు లభించలేదు. రెండు విడతలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తండాలను గ్రామ పంచాయితీలుగా గుర్తించి గిరిజన వర్గాలకు చేరువయ్యామని భావించింది. కానీ, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో లంబాడీ సామాజికవర్గంలో మెజార్టీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఫలితాలను విశ్లేషించిన బీఆర్ఎస్ పార్టీ అంచనాకు వచ్చింది.

కొత్త ప్రభుత్వ ఏర్పడిన సరిగ్గా ఏడాదిలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనుల భూసేకరణపై రగడ చోటు చేసుకోవడంతో దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేలా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయడాన్ని బీఆర్ఎస్ ముందు నుంచి తప్పు పడుతూ వస్తోంది. నగర శివారులో ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం భూసేకరణ జరిపినా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఫార్మా విలేజ్ ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదంటోంది బీఆర్ఎస్.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ అంశం తీవ్ర వివాదంగా మారింది. భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది. దీంతో రాష్ట్ర రాజకీయం ఇప్పుడీ అంశం చుట్టూ తిరుగుతోంది. ఈ ఘటన బీఆర్ఎస్ నేతల కుట్రలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ప్రజలు తిరుగుబాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు.

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని.. అధికారులపై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారుడిగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే రిమాండ్ చేశారు. ఇక, ఈ అంశాన్ని గులాబీ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేసేందుకు ఇదొక అస్త్రంగా గులాబీ పార్టీ భావిస్తోంది.

 

Also Read : హస్తంలో అంతర్మథనం? చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నామన్న భావనలో కాంగ్రెస్..!