kcr thanks union govt for announce to bharat ratna for pv narasimha rao
KCR on PV Narasimha Rao Bharat Ratna: తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: బండి సంయ్
తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సంజయ్ కుమార్ వర్ణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడంతో ఆ జిల్లా వాసిగా గర్వపడుతున్నానని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరిస్తే.. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్దికి వాడుకుందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు.
దేశ ప్రజలందరికీ గర్వకారణం: కిషన్ రెడ్డి
ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం భారత రత్నకు ఎంపికవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దేశం కోసం, దేశాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి హోదాలో.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ పురోగతికి పీవీ పునాదులు వేశారని ప్రశంసించారు.
తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: డీకే అరుణ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రకటించడం సంతోషదాయకమని, ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. విశిష్ట పండితుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడిగా.. నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని కొనియాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్టం చేయడంలో పీవీ నరసింహా రావు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.