KCR
BRS Party : భారత ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం (సెప్టెంబర్ 9న) ఓటింగ్ జరగనుంది. ఎన్డీయే కూటమి తరపున తమిళనాడు రాష్ట్రంకు చెందిన బీజేపీ సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరపున తెలంగాణ రాష్ట్రంకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభించాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయం అని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాన్ని ఇవాళ సాయంత్రం వరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న విషయం తెలిసిందే.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరి మద్దతు ఇస్తారనే అంశంపై గతంలో కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపర్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వమని చెప్పారు.. అదే సమయంలో రాష్ట్రానికి ఎరువులు ఎవరు తీసుకొస్తే వారికి మద్దతు ఇస్తామని కేటీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చల అనంతరం ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.