ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ పొలంబాట కార్యాచరణ

Brs: రైతులు రుణాలను చెల్లించొద్దని తాము అండగా ఉంటామని హామీ ఇస్తోంది బీఆర్ఎస్.

KCR

గ్రామాల బాట పడుతోంది బీఆర్ఎస్. పొలం బాట కార్యక్రమంతో రైతుల దగ్గరకి వెళ్లనుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పొలం బాట కార్యక్రమానికి పిలుపునిచ్చారు గులాబీ బాస్. అకాల వర్షాలతో పాటు, నీరు అందక పంటనష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ నేతలు.

గ్రామాల్లో ఉన్న పరిస్థితులపై సంపూర్ణ నివేదికలను నేతల ద్వారా తెప్పించుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు మంగళవారం నుంచి గ్రామగ్రామాన ఎండిన పంటల వివరాలను సేకరించనున్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ చెబుతోంది. క్షేత్రస్థాయి నుంచి పంటనష్టం వివరాలను సేకరించిన తర్వాత గ్రామాల వారీగా ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అవుతోంది.

రెండు-మూడు వారాల్లో
రెండు మూడు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేస్తోంది. నష్టపోయిన రైతుకు ఎకరాకు 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, నీటి నిర్వహణపై ప్రణాళిక అమలు చేయలేకపోవడం కారణంగానే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు గులాబీ లీడర్లు.

ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న హామీని.. ఈ సీజన్‌ నుంచే అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రైతుబంధు నిధులు అందక, ఎండిన పంటలతో రైతులు అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు నేతలు. అప్పులు చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.

రైతులు రుణాలను చెల్లించొద్దని తాము అండగా ఉంటామని హామీ ఇస్తోంది బీఆర్ఎస్. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీని చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ కోరుతుంది. ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకపోతే లక్షలాదిమంది రైతులతో సచివాలయం ముట్టడిస్తామంటున్నారు గులాబీ లీడర్లు.

పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేపడుతున్న పొలం బాటతో రైతుల మద్దతు కూడగట్టొచ్చన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తం అవుతుంది. రైతు సమస్యల ఎజెండాతోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ కార్యాచరణను పిలుపునిచ్చింది.

తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది వీరే.. ఎవరి బలం ఎంత? అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి కూడా..

ట్రెండింగ్ వార్తలు