BRS: బీఆర్‌ఎస్‌లో వారసుల సందడి.. విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లు.. కుదరదంటున్న కేసీఆర్

కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు.

BRS Party, KCR

BRS senior MLAs : అధికార బీఆర్‌ఎస్‌లో వచ్చే ఎన్నికల నుంచి పోటీ చేసే సిట్టింగులు ఎందరు? ఈ సారి తమ బదులుగా వారసులకు (heirs) చాన్స్ ఇవ్వాలని చూస్తున్న సీనియర్లు ఎవరెవరు? గెలుపు గుర్రాలుగా ఉన్నవారు తప్పుకుంటామంటే సీఎం కేసీఆర్ (CM KCR) సరేనంటారా? ఈ సారికి వద్దు అంటూ ఎప్పటిలాగే వాయిదా వేసేస్తారా? ఇంతకీ గులాబీదళంలో ఏం జరుగుతోంది.. వారసులను తీసుకొద్దామనుకుంటున్న సీనియర్లు ఏం చెబుతున్నారు? బీఆర్‌ఎస్ బాస్ ఏమంటున్నారు? కారు పార్టీలో తెరచాటు రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీలో సందడి పెరుగుతోంది. సిట్టింగ్‌ల్లో చాలా మందికి సీట్లు ఇస్తాం.. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం.. అంటూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల్లో ఆశలు పెంచుతుండటంతో ఎక్కడా లేని జోష్ చూపిస్తున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఐతే ఇదే సమయంలో కొందరు సీనియర్లు ఇక చాల్లే అనుకుంటూ రాజకీయాల నుంచి వైదొలగాలని చూస్తున్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. ఎలాగూ గెలవబోయే పార్టీయే కనుక.. ఈ సారి తమ వారసులను తెరపైకి తెచ్చి.. వారిని భవిష్యత్ నేతలుగా తీర్చిదిద్దాలని కలలు కంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఇందులో కొందరు మంత్రులతోపాటు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ప్రతి జిల్లాలోనూ సీనియర్లు విశ్రాంతి తీసుకుని తమ వారసులకు చాన్స్ ఇవ్వాలని కోరుతుండగా, సీఎం కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారట.. మీరైతేనే గెలుస్తారు.. సర్వేలు కూడా మీకే అనుకూలంగా ఉన్నాయంటూ సీనియర్ల ఆశలపై నీళ్లు జల్లుతున్నారని ప్రగతిభవన్ టాక్.

Pocharam Bhasker Reddy

పోటీకి సీనియర్ ఎమ్మెల్యేల అనాసక్తి
నల్లగొండ నుంచి నిజామాబాద్‌ వరకు.. మహబూబ్‌నగర్ నుంచి ఆదిలాబాద్‌ వరకు చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఈ సారి పోటీకి అనాసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తన బదులుగా కుమారుడు భాస్కర్‌రెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నారు. భాస్కర్‌రెడ్డి ఇప్పటికే డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుస్తున్న పోచారం ఇక విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం మళ్లీ పోచారంనే పోటీ చేయాలని సూచిస్తున్నారని చెబుతున్నారు.

Amith Gutha

అదేవిధంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా తన కుమారుడు అమిత్‌ను తెరపైకి తెస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి సుఖేందర్‌రెడ్డి కుమారుడిని పోటీ చేయించాలని చూస్తున్నా.. సీఎం కేసీఆర్ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నారట. అవసరమైతే మునుగోడు నుంచి పోటీకి రెడీగా ఉండాలని సుఖేందర్‌రెడ్డికి చెప్పారట సీఎం కేసీఆర్. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి కుమారుడు జగన్ పోటీ చేయాలని ఉవ్విళ్లురుతున్నారు. ప్రస్తుతం జడ్‌పీటీసీగా ఉన్న జగన్ ఆశలపై నీళ్లు జల్లుతూ గోవర్దన్‌రెడ్డినే పోటీ చేయాలని ఆదేశిస్తున్నారు సీఎం.. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇద్దరు కుమారులు ఈ సారి పోటీకి రెడీ అవుతున్నారు. సీఎం మాత్రం అబ్రహం, అంజయ్యలనే మళ్లీ పోటీ చేయాలని చెబుతున్నారు.

Mynampally Rohith

ఆసక్తికరంగా మెదక్ రాజకీయం
ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ రాజకీయం కూడా ఆసక్తికరంగా మారింది. మెదక్ నుంచి ప్రస్తుతం పద్మా దేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆమె స్థానంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపాటి హన్మంతరావు తనయుడు రోహిత్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఐతే ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ ఇచ్చే చాన్స్ లేనందున మైనంపాటి మల్కాజిగిరిలో కొనసాగే అవకాశం ఉందంటున్నారు. రోహిత్‌కు మరోసారి చాన్స్ ఇద్దామని ఈ సరికి సర్దుకుపోవాలని సీఎం చెప్పారని సమాచారం.

Vanama Raghava

మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఇటీవల హైకోర్టు అనర్హత వేటు వేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి విముఖంగా ఉన్నారని చెబుతున్నారు. తన బదులుగా కుమారుడు రాఘవకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఐతే ఇక్కడి నుంచి వీరిలో ఏ ఒక్కరికీ టిక్కెట్ దక్కే చాన్స్ లేదని బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. వనమా రాఘవపై ఉన్న ఆరోపణలే ప్రతిబంధకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పొత్తుల్లో ఈ సీటు కమ్యూనిస్టులకు ఇస్తారనే మరో ప్రతిపాదన కూడా ఉంది. ఇదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కూడా ఈ సారి తన కుమారుడు విద్యుత్‌కు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఐతే దివాకర్‌రావుపై వ్యతిరేకత ఉన్నందున ఇక్కడి నుంచి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఉందంటున్నారు.

Jogu Premender

వారసులను వద్దంటున్న కేసీఆర్
ఇక ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఈసారి వారసులను పోటీకి పెట్టాలని ప్రతిపాదిస్తుంటే.. వద్దని చెప్పేస్తున్నారు కేసీఆర్. సర్వేల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే మొగ్గు కనిపిస్తుండటంతో ఈ ఇద్దరి సీనియర్ల ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు సీఎం కేసీఆర్. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు బదులుగా ఎంపీ కవిత పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆమెకు పోటీగా కవిత సోదరుడు కూడా టిక్కెట్ ఆశిస్తుండటంతో రెడ్యానాయక్‌నే మళ్లీ పోటీ చేయమంటున్నారు సీఎం.. కరీంనగర్ జిల్లా కోరుట్లలో సీనియర్ ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సర్వేల్లో ఈ ఇద్దరికీ సానుకూల ఫలితాలు వస్తుండటంతో… సీఎం నిర్ణయంపై ఉత్కంట నెలకొంది.

Also Read: తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతారా?

Karthik Reddy Patlolla

ఇక ఇదే జిల్లా పెద్దపల్లిలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోడలికి టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదన ఉండగా, కుదరదని సీఎం చెప్పేశారని అంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారు. తన బదులుగా ఈ సారి కుమారుడు కార్తీక్‌రెడ్డిని మహేశ్వరం నుంచి పోటీకి పెట్టాలని చూస్తున్నారు. ఐతే సబిత ప్రతిపాదననూ తిరస్కరిస్తున్నారు సీఎం కేసీఆర్. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్ టిక్కెట్ ఆశిస్తున్నారు. టిక్కెట్ వస్తుందనే ధీమాతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు. కానీ, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికే సర్వేలు అనుకూలంగా ఉండటంతో ప్రశాంత్‌కు టిక్కెట్ కుదరదని అంటున్నారు ముఖ్యమంత్రి.

Also Read: జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేస్తారా.. కేటీఆర్‌తో భేటీ అందుకేనా?

ఇలా వీరే కాకుండా.. సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తమ వారసులను రంగంలోకి దింపాలని చూస్తున్నా.. ముఖ్యమంత్రి మాత్రం ప్రయోగాలకు ఇది సమయం కాదని దాటవేస్తున్నారట.. మరో రెండు నెలల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటం.. ఈ నెలలో మొదటి జాబితా ప్రకటిస్తారనే ఊహాగానాలతో బీఆర్‌ఎస్‌లో వారసుల రాజకీయ రంగం ప్రవేశం హాట్ హాట్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు