ఈ ఆరు సీట్లపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్‌.. పార్టీ నుంచి వెళ్లిన నేతలను ఓడించేందుకు..

BRS: సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

KCR  Focus on 6 Seats: పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ. 17 ఎంపీ సీట్లలో ఆరు స్థానాలపై మాత్రం గులాబీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గులాబీ పార్టీని వీడి జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల నియోజకవర్గాలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది.

చేవెళ్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉండటంతో ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్టీ.

ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి..
జహీరాబాద్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీబీ పాటిల్‌కు బ్రేకులు వేసేందుకు మాజీమంత్రి హరీశ్ రావు చక్రం తిప్పుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపారు. ఆయనకు చెక్‌ పెట్టేలా అదే సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దించింది బీఆర్ఎస్.

సికింద్రాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను బరిలోకి దించుతోంది. ఆదిలాబాద్‌లో గోడెం నగేష్‌ను ఎదుర్కొనేలా సీనియర్ నేత అత్రం సక్కుకు అవకాశం ఇచ్చారు. వరంగల్‌లో కడియం కావ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత పార్టీ మారడంతో ఈ అంశాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

Also Read: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన కేసీఆర్

ఓరుగల్లు నుంచి?
ఓరుగల్లు నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లిన నేత కావడంతో ఇద్దరికీ చెక్ పెట్టేలా బలమైన నేతను బరిలోకి దించాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. జిల్లాకు చెందిన నేతలతో పార్టీ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. త్వరలో వరంగల్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించనుంది.

పార్టీ మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతలకు చెక్ పెట్టడంతో పాటు గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటేనే పార్టీ క్యాడర్‌లో జోష్‌ పెరుగుతుందని భావిస్తున్నారు గులాబీ నేతలు.

ట్రెండింగ్ వార్తలు