రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టాయి.. కానీ.. కాలగర్భంలో కలిసిపోయాయి.. ఈ 2 పార్టీలు మాత్రం..

కేసీఆర్‌ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్‌ నేతల డైలమాకు ప్రధాన కారణం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపిస్తే.. టీడీపీ ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ఆత్మగౌరవం , ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్‌. గులాబీ పార్టీదీ తిరుగులేని చరిత్రే. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలూ సుదీర్ఘకాలం మనుగడలో ఉన్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నమ్మే కేసీఆర్‌.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టాయి. కానీ.. కాలగర్భంలో కలిసిపోయాయి. సుదీర్ఘకాలంపాటు ఒక ప్రాంతీయ పార్టీ జయాపజయాల్ని తట్టుకుని నిలబడింది అంటే.. ఆ వరుసలో టీడీపీ, బీఆర్ఎస్‌ ముందుంటాయి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు.ఎన్టీఆర్‌. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తూ సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు 43 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ.. ప్రస్తుతం ఏపీలో అధికారపార్టీగా ముందుకు సాగుతోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో పురుడుపోసుకున్న బీఆర్ఎస్‌ ఇప్పుడు పాతికేళ్ల ప్రస్థానంలో అడుగు పెట్టింది. రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ది కొత్త రాష్ట్రంలో సరికొత్త రికార్డే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నా.. మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్‌.

నీళ్లు, నిధులు, నియామకాలకోసం తెలంగాణ పోరాటం సాగితే.. ఆ ఉద్యమంలో కేసీఆర్‌ తనకంటూ ప్రత్యేక పేజీల్ని కేటాయించుకోగలిగారు. బీఆర్ఎస్‌కు ముందు కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి. ఉద్యమించాయి. కానీ.. కేసీఆర్‌ అనుసరించిన పంథా, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, అన్నీ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. విద్యుత్‌ సంస్కరణల పేరుతో నాడు టీడీపీ తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ పోరాటానికి బీజం వేశాయి.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను బలోపేతం చేసిన సభలు
ఈ నేపథ్యంలోనే 1997 మార్చిలో భువనగిరి సభ, 1997 ఆగస్టులో సూర్యాపేట మహాసభ, 1997 డిసెంబరులో వరంగల్ సభ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను బలోపేతం చేశాయి. అదే సమయంలో టీడీపీలోనే ఉన్న కేసీఆర్‌.. పార్టీ నుంచి బయటకొచ్చి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అవతరించారు.

దీంతో తెలంగాణలో అప్పటివరకు ఉన్న ఓ పొలిటికల్‌ వ్యాక్యూమ్‌ను కేసీఆర్‌ ఫిల్‌ చేశారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ కోదండరాం, పలువురు మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇలా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీరోల్‌ పోషిస్తూ సక్సెస్‌ అయ్యారు.

గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో బీఆర్ఎస్‌ జెండా ఎగిరిందండే.. దానికి కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాలే కారణం. కాంగ్రెస్‌తో ఓసారి, టీడీపీతో మరోసారి పొత్తులు పెట్టుకున్నా.. బీఆర్ఎస్‌ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సమాజం మద్దతు పలికింది. 2009 కేసీఆర్‌ నిరాహార దీక్షతో ఉద్యమ స్వరూపం మారిపోయింది.

చివరికి ఇలా..
విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, సకల జనులను .. కలిసొచ్చే రాజకీయ పార్టీలను లీడ్‌ చేస్తూ ఉద్యమానికి ఊపిరులూది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు సాకారం చేయడంలో బీఆర్ఎస్‌ కీలక పాత్రే పోషించింది. అధికారంలో ఉన్నప్పుడు వినూత్న సంస్కరణలు, కొత్త స్కీమ్‌లతో పదేళ్లు సీఎంగా కేసీఆర్‌ వేసిన అడుగులు ఆ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి కారణమయ్యాయి. 2023 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. కారు సింబల్ పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కేసీఆర్‌ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్‌ నేతల డైలమాకు ప్రధాన కారణం. అయినా.. అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజల పక్షాన పోరాడటంలో బీఆర్ఎస్‌ తనకంటూ ప్రత్యేక పంథానే అవలంబిస్తోంది. పాతికేళ్ల ఈ గులాబీ మరోసారి గుబాళిస్తుందని ఆ పార్టీ శ్రేణులు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముందు ముందు కేసీఆర్‌ వ్యూహాలు మరింత పదునుతేలుతాయంటున్నారు. చూడాలి విపక్ష నేతగా కేసీఆర్‌ ఎలాంటి పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్తారో..