Telangana Assembly : అసెంబ్లీలో రచ్చరచ్చ.. పేపర్లు, వాటర్ బాటిల్స్ విసిరిన సభ్యులు

తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు ..

Telangana Assembly

Telangana Assembly Sessions 2024 : తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాగితాలు, వాటర్ బాటిల్స్ విసిరివేయడంతో సభలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Also Read: TTD: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్‌షాక్‌.. చర్యలకు సిద్ధమైన టీటీడీ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తమకు సభలోనే చెప్పులు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్ నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ ను అమానించేలా సభలో వ్యవహరించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే, తొలుత మంత్రి పొంగులేటిపై వాటర్ బాటిల్స్ విసిరారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.