TTD: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగ్‌షాక్.. చర్యలకు సిద్ధమైన టీటీడీ
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చర్యలకు సిద్ధమైంది.

Srinivasa Goud
Srinivasa Goud: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ పై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. గురువారం తిరుమలలో టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను టీటీడీ తీవ్రంగా పరిగణించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.
Also Read: Gossip Garage : జగన్ మార్క్ రాజకీయం మొదలైందా? చెల్లి షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా?
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విటర్ ప్రకారం.. ‘‘ తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నాం. తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటివారైనా సరే ఉపేక్షించేదేలేదు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం.’’ అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే..
గురువారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. తిరుమలలో తెలంగాణ నాయకులు, ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ లబ్ధి పొందుతుంది ఆంధ్రా వాళ్లే.. పదవుల్లో లబ్ధి పొందుతున్నది వారేనని, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రా వారికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను కూటమి ప్రభుత్వం పునరుద్దరించాలని కోరారు.