దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా బయటకు రా- సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.

Ktr Challenge : అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంపై రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టండి అని కేటీఆర్ అన్నారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న వివేక్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ ఫామ్ హౌజ్ లను కూలగొట్టాలని, ఆ తర్వాత మిగతా వాటి సంగతి చూడాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు కేటీఆర్.

”రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద శాంతియూతంగా నిరసన చేపట్టాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రైతుల రుణమాఫీపై నిరసన తెలుపుతున్న శిబిరంపై దాడులు చేశారు. మా వాళ్ళు తిరగబడితే కాంగ్రెస్ గూండాలు ఒక్కరు కూడా మిగిలే వారు కాదు. స్థానిక పోలీసులు గూండాలకు వత్తాసు పలికారు. గల్లీ అవస్థలు వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20వ సారి ఢిల్లీ పోయారు. ముఖ్యమంత్రి సొంత గ్రామంలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టుల మీద దాడి చేశారు. వెల్డండి పోలీస్ స్టేషన్ వరకు మహిళా జర్నలిస్టులను వెంబడించి దాడి చేశారు. ఇద్దరు జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిచ్చింది.

రేవంత్ రెడ్డి మగాడివి అయితే సెక్యూరిటీ లేకుండా బయట కు రా. రుణ మాఫీ ఎక్కడా కాలేదు. ఈ అంశాలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశాం. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. వారి మీద 302 కేసులు నమోదు చేయాలి. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. డీజీపీ అన్నీ పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీయవద్దనే మేము పదేళ్లు స్వచ్ఛందంగా పరిపాలించాము” అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అరాచక పాలన- జగదీశ్వర్ రెడ్డి
”కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను వాడుకుంటూ శాంతి భద్రతలను నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, సోషల్ సర్వీస్ చేసే వారి మీద, రైతులు, జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో శాంతియుతమైన ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గూండాలు పోలీసులు భాగస్వామ్యంతోనే దాడులకు తెగబడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.”

 

ట్రెండింగ్ వార్తలు