బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లు కూలుస్తారా..? హైడ్రా అసలు టార్గెట్ అదేనా?

రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్‌ కేటీఆర్‌ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్‌.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లు కూలుస్తారా..? హైడ్రా అసలు టార్గెట్ అదేనా?

Gossip Garage : హడలెత్తిస్తోంది. హాట్ టాపిక్ గా మారింది. నగరంలో యాక్షన్ మొదలెట్టి పట్టణం శివారు వరకు వెళ్లింది. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఆ తర్వాత మరింత దూరం వెళ్లింది. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందా? అంటే అవుననే అంటోంది అపోజిషన్. హైడ్రాను ప్రారంభించి నెల రోజులే అయ్యింది. కానీ, దాని చుట్టే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆక్రమణలపైనే చర్యలు ఉంటాయని హైడ్రా అంటుంటే.. దాని ఏర్పాటు లక్ష్యం వేరే అని ప్రధాన పక్షం ఆరోపిస్తోంది. ఇంతకీ హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? బీఆర్ఎస్ నేతల కట్టడాలపైనే ఫోకస్ పెట్టారా? అదే నిజమైతే ప్రముఖులందరి గెస్ట్ హౌస్ లపై చర్యలు ఉంటాయా?

15 రోజులుగా బుల్డోజర్లతో హైడ్రా దండయాత్ర..
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో టాపిక్‌ ఆఫ్‌ ది న్యూస్‌గా మారింది హైడ్రా. 15 రోజులుగా బుల్డోజర్లతో దండయాత్ర చేస్తోంది. ఒక్కోరోజు ఒక్కో ప్లేస్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉన్నట్లుండి సిటీలో కూల్చివేతలు బంద్ చేసి.. ఓఆర్‌ఆర్‌ అవతల డిమాలిష్‌ మొదలుపెట్టింది హైడ్రా. ఇదే ఇప్పుడు అందరిలో అనుమానాలకు కారణం అవుతోంది. ORRకు దగ్గరలో ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌ FTL, బఫర్‌ జోన్లలో అక్రమ కట్టడాల కూల్చివేత మొదలు పెట్టింది హైడ్రా. దీంతో అసలు కథే వేరే ఉందంటూ అనుమానాలు మొదలయ్యాయి. రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్‌ కేటీఆర్‌ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్‌.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

బడాబాబుల ఫాంహౌస్‌ల పని పడుతుందా..?
ఇప్పటివరకు ప్రముఖుల కట్టడాలు, గెస్ట్ హౌస్‌ల జోళికి వెళ్లలేదు హైడ్రా. దీనికి ప్రధాన కారణం ఆ ఫాంహౌస్‌లు హైడ్రా పరిధిలో లేకపోవడమే అనే టాక్‌ విన్పిస్తోంది. దీంతో త్వరలో 111 జీవో పరిధిలోని ప్రాంతాలను కూడా హైడ్రా కిందకు తీసుకొచ్చి అసలు టార్గెట్‌ ను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రముఖుల గెస్ట్‌హౌస్ లపై చర్యలుంటాయా.? చెరువుల FTL, బఫర్‌జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా … బడాబాబుల ఫాంహౌస్‌ల పని పడుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. హైడ్రా విధివిధానాల ప్రకారం గెస్ట్ హౌస్‌లపై చర్యలకు అవకాశం లేదని తెలుస్తోంది. అందుకే హైడ్రా అధికారాలు, పరిధి పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి అధికారులతో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

111 జీవో పరిధిలో ప్రాంతాలను హైడ్రా కిందకు తేవడం వెనక భారీ వ్యూహం..
111 జీవో పరిధిలో ప్రాంతాలను హైడ్రా కిందకు తేవడం వెనక భారీ వ్యూహమే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 111జీవో పరిధిలోని ఏరియాలో చాలామంది బీఆర్ఎస్ నేతలకు వందల ఎకరాలు భూములు, ఫాంహౌస్‌లు ఉన్నట్లు ఎప్పటినుండో కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అందుకే BRS హయాంలో 111 జీవో ఎత్తేసే ప్రయత్నం జరిగిందన్నది కాంగ్రెస్ వాదనగా ఉంది. ఇప్పుడు ఒకవేళ 111 జీవో పరిధిలోకి హైడ్రా వెళ్తే ఏయే బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌ కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయింది. FTL, బఫర్ జోన్ పరిధిలో కట్టిన నిర్మాణాలు..111 జీవో పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతల ఫాంహౌస్ లు, ఆక్రమిత భూముల వివరాలు సేకరించే పనిలో పడింది.

వీటిని ఎప్పుడు కూలుస్తారు అంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు..
ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలామంది FTL, బఫర్ జోన్లలో ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భవనాలు, ఫాంహౌస్‌ నిర్మాణాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఎప్పుడు వీటిని కూల్చివేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని అక్రమ కట్టడాలపై చర్యలు ఉంటాయా.. లేక మీకు టార్గెట్‌ ఉన్న నేతల ఆస్తులనే ధ్వంసం చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇప్పటికే బఫర్‌ జోన్లలో కాంగ్రెస్‌ కీలక నేతలకు ఎవరెవరికి నిర్మాణాలున్నాయో బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Also Read : మేము అధికారంలోకి వస్తే ఆ నాయకుల పేర్లను తొలగిస్తాం- కేటీఆర్

కాంగ్రెస్ నేతల గెస్ట్ హౌస్‌లపై చర్యలు తీసుకుంటారా?
ఇప్పుడు రేవంత్‌ సర్కార్ హైడ్రా పరిధిలోకి 111 జీవో ప్రాంతాలను తీసుకొస్తుందా.. ఒకవేళ తీసుకొస్తే కాంగ్రెస్ నేతల గెస్ట్ హౌస్‌లపై చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆరోపణలు, విమర్శలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హైడ్రా సెంట్రిక్‌గా డైలాగ్‌ వార్ నడుస్తోంది. వీటిని పట్టించుకోకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ మాత్రం తన యాక్షన్‌ తాను చేసుకుంటూ బుల్డోజర్లతో ముందుకు సాగుతూనే ఉన్నారు. అయితే ఈ బుల్డోజర్ల టార్గెట్‌ బీఆర్‌ఎస్‌ నేతల ఆక్రమణలేనా… కాంగ్రెస్‌ నేతల ఆక్రమణలను సైతం పెకిలించేందుకు సిద్దమౌతున్నాయా అన్నది చూడాలి మరి.