సీఎం రేవంత్ రాజీనామాకు కేటీఆర్ డిమాండ్.. నెల రోజుల డెడ్‌లైన్.. బీజేపీ యాక్షన్ తీసుకోకపోతే..

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాజాగా.. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డిని ఈడీ ఛార్జిషీట్ లో చేర్చిందని అన్నారు. రేవంత్ గతంలో రూ.50కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నట్లు కోమటిరెడ్డి చెప్పాడని.. ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడిందని కేటీఆర్ అన్నారు.

రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు.. మూటల ముఖ్యమంత్రి అని తేలిపోయింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి చార్జిషీట్ లో ఈడీ రేవంత్ పేరును చేర్చితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు..? రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేదంటే కాంగ్రెస్ నేతలు ఆయన్ను సీఎం పదవి నుంచి దింపేయాలని కేటీఆర్ అన్నారు.

రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక 44వ సారి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో రాత్రి సమయంలో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఇద్దరు బాస్ లు ఉన్నారు. బీఆర్ఎస్ పై నిందలు, ఢిల్లీ బాస్ లకు చందాలు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

అమృత్ స్కాం, సివిల్ సప్లయ్ స్కాం, యంగ్ ఇండియా.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంలపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదు.. ఎందుకు విచారణకు కేంద్రం ఆదేశించడం లేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల విషయంలో ఫైనాన్సియల్ ఫ్రాండ్ జరిగిందని సెంట్రల్ ఎన్‌పవర్డ్ కమిటీ చెప్పింది. ఖచ్చితంగా దీన్ని ప్రత్యేక ఏజెన్సీతో విచారణ జరిపించాలని నివేదిక ఇచ్చింది. మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే కేంద్ర ఏజెన్సీలు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

నేషనల్ హెరాల్డ్ విషయంలోనైనా కేంద్రం స్పందిస్తుందో లేదో నెల రోజులు ఎదురు చూస్తాం. అప్పటికీ స్పందించకపోతే పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చేపడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవచకుండలాలుగా కాపాడుతున్న బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగతామని కేటీఆర్ అన్నారు.