brutal incident in Palghar district of Maharashtra
Mumbai: పక్కింట్లోని యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. భర్త అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. భర్తను చంపేసి ప్రియుడితో జీవితాంతం వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని భావించింది. దీంతో భర్తను చంపేసి ఇంట్లోని టైల్స్ కింద పాతిపెట్టింది. అయితే, మరిది ఎంట్రీ ఇవ్వడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టయింది.
మహారాష్ట్రంలోని ఫాల్‌ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలోని తూర్పు నలసపోరా ప్రాంతం గడ్గపాడాలో విజయ్ చౌవాన్ (34) తన భార్య కోమల చౌవాన్ (28)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే మోను శర్మ (20)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్దికాలంకు వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తలేని సమయంలో కోమల చౌహాన్, మోను శర్మ కలుసుకునే వారు. కొన్నిరోజుల తరువాత వీరిద్దరి ప్రవర్తనపై భర్తకు అనుమానం వచ్చింది. భార్య కోమల చౌహాన్‌ను మందలించాడు.
మోను శర్మతో వివాహేతర సంబంధం గురించి తన భర్తకు తెలియడంతో.. అతని అడ్డు తొలగించుకునేందుకు కోమల చౌహాన్ నిర్ణయించుకుంది. మోను శర్మతో ఈ విషయాన్ని చెప్పడంతో అతను కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఓ రోజు విజయ్ చౌహాన్‌ను చంపేసి.. ఇంట్లోని ఫ్లోర్ టైల్స్ కింద పాతిపెట్టారు. రెండు రోజుల తరువాత విజయ్ చౌహాన్ తమ్ముడు ఇంటికి వచ్చాడు. తన అన్న ఆచూకీకోసం వెతికాడు. కానీ, ఎక్కడ కనిపించక పోవటంతో పదిరోజుల తరువాత తన అన్న విజయ్ చౌహాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తరువాత కోమల చౌహాన్, మోను శర్మ కనిపించకుండా వెళ్లిపోయారు.
తన అన్నను కోమల చౌహాన్ చంపేసి ఉంటుందని విజయ్ చౌహాన్ తమ్ముడికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్లోని టైల్స్ తీసి మళ్లీ అమర్చినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లువచ్చి టైల్స్‌ను తొలగించి చూడగా.. విజయ్ చౌహాన్ మృతదేహం లభ్యమైంది. మరోవైపు కోమల చౌహాన్, పక్కింట్లోని మోను శర్మ కొద్దిరోజులుగా కనిపించక పోవటంతో.. వారిద్దరే కలిసి విజయ్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని స్థానికులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.