తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ సర్కారు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో అన్నదాతల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
సామాజిక న్యాయానికి సర్కారు కట్టుబడి ఉందని జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. అభివృద్ధి వైపుగా రాష్ట్రం అడుగులు వేస్తోందని తెలిపారు. భారత్‌లో తెలంగాణ అత్యధికంగా ధాన్యం పండిస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతు భరోసా కింద తెలంగాణలో ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడింది.
ఇది అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలా లేదు: కేటీఆర్
అసెంబ్లీలో ఇవాళ తాము విన్నది గవర్నర్ ప్రసంగంలా లేదని, గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రసంగంలా ఉందని కేటీఆర్ అన్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమీ లేవని అన్నారు. గవర్నర్‌తో కాంగ్రెస్ అన్నీ అసత్యాలు చెప్పించిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పానలో విఫలమైందని అన్నారు. రైతుల సమస్యలపై గవర్నరు ప్రసంగంలో ప్రస్తావన లేదని చెప్పారు. సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 100 శాతం రైతు రుణమాఫీ కాలేదని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం నెలకొన్నదని చెప్పారు. 20 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లు ధర్నా చేశారని, ఇది సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. ఢిల్లీకి కాంగ్రెస్ మూటలు పంపుతోందని చెప్పారు. గురుకులాల్లో అధ్వానమైన పరిస్థితి నెలకొందని అన్నారు.