Revanth Reddy - CAG report
CAG report: రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..తెలంగాణ పాలిటిక్స్‌లో అప్పులు-వడ్డీల లొల్లి మారుమోగుతోంది. గత కేసీఆర్ సర్కార్..అడ్డుగోలుగా చేసిన అప్పులు..ఇప్పుడు పెను భారంగా మారాయని..వడ్డీలు కట్టేందుకే ప్రభుత్వం ఆదాయం సరిపోతుందని చెప్పుకుంటూ వస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
బహిరంగా సభ అయినా..పార్టీ మీటింగ్ అయినా..చివరికి అధికారుల రివ్యూనైనా..ఇదే మాట విషయాన్ని మెయిన్ పాయింట్‌గా ఎత్తుకుంటున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని..ఆ అప్పుకు మిత్తీ చెల్లించేందుకే…. సర్కార్ ఖజానా కరిగిపోతుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది.
అయితే రేవంత్ సర్కార్ చెబుతున్న అప్పుల లెక్క తప్పు అని బీఆర్ఎస్ వాదిస్తూ వస్తోంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన 20 నెలల్లో, సర్కార్ దాదాపు 2.20 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినట్లు లెక్కలు చెప్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి..అప్పులతో కాలం వెళ్లదీస్తూ..బీఆర్ఎస్‌ను బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని గులాబీ పార్టీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు.
ఇలా ఇప్పటివరకు..ప్రతి నెల 10 వేల కోట్లు అప్పులు చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్. ఇలా గత ఏడాది..రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల… రూపంలో రూ. 75,456 కోట్లు చెల్లించినట్లు కాగ్ చెబుతున్నది నిజం కాదా…? అని సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది గులాబీ పార్టీ. చారాణా మిత్తి చెల్లించి..బీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు బారాణా చెల్లిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు.
సర్కార్ వర్సెస్ అపోజిషన్ అప్పులపై ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తుండగానే..కాగ్ తెరపైకి తెచ్చిన లెక్కలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రానికి రూ.74,955 కోట్ల రాబడి వచ్చిందని కాగ్ తేల్చింది. ఇందులో రేవంత్ సర్కార్ కొత్తగా తీసుకున్న అప్పులే 24,670 కోట్లు ఉన్నాయంటోంది కాగ్. (CAG report)
అంటే నాలుగు నెలల్లోనే రేవంత్ సర్కార్ చేసిన అప్పులు 24వేల 670 కోట్లని స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వం జూలై నాటికి వడ్డీ చెల్లింపుల కోసం 9వేల 355 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. ఈ లెక్కన ప్రతీ నెలా చెల్లిస్తున్న వడ్డీ 2వేల 338 కోట్లే కదా.? అన్నది బీఆర్ఎస్ పాయింట్. మరీ ఎందుకు 6500 కోట్లు మిత్తీ కడుతున్నట్లు బీఆర్ఎస్‌ను బద్నాం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ సర్కార్, బీఆర్ఎస్, కాగ్ రిపోర్ట్ కథ ఇట్లుంటే..రోజు రోజుకు సర్కార్ ఖజానాకు..ఆదాయం తగ్గుతూ వస్తోందట. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులైన.. జీఎస్టీ, ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్ టాక్స్, ఎక్సైజ్ ఆదాయం గడిచిన నాలుగు నెలల్లో..పెరగకపోగా..తగ్గుతూ వస్తుండటం..సర్కార్‌కు మరింత గుదిబండగా మారిందట. జీఎస్టీలో 3శాతం, సేల్స్ ట్యాక్స్‌లో 2శాతం, స్టేట్ ఎక్సైజ్ పన్నులో..రెండున్నర శాతం తగ్గగా..ల్యాండ్ రెవెన్యూ ఆదాయం 2.3 శాతం..గతేడాది కంటే ఈ ఏడాది తగ్గిందట.
మరోవైపు… అప్పులు మాత్రం…ఈ నాలుగు నెలల్లో 45 శాతం చేసిందట రేవంత్ సర్కార్. ఇది కాగ్ చెప్పిన మాట. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ చేసిన కొత్త పథకాలు హమీల పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మహాలక్ష్మీ కింద నెలకు 2500 రూపాయలు, డబుల్ పెన్షన్లు, రాజీవ్ యువవికాసం, కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు..ఇలా ఈ పథకాలకు మోక్షం దక్కుతుందా.? అనేది అందరిలో వ్యక్తమవుతున్న డౌట్. ఇటు సర్కార్, అటు బీఆర్ఎస్ అప్పులు లెక్కలతో… కుస్తీ పడుతూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా..కాగ్ లెక్కలతోనైనా ఈ పంచాయితీకి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో చూడాలి మరి.