Jubilee Hills Bypoll 2025
Jubilee Hills Bypoll 2025: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. నవంబరు 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబరు 14న వెలువడుతాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 2,08,561, మహిళా ఓటర్లు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. పోలింగ్ బూత్‌లు 407, పోలింగ్ కేంద్రాలు 139 ఏర్పాటు చేస్తున్నారు. (Jubilee Hills Bypoll 2025)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. అందులో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, కొందరు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
ఇవాళ ప్రచారానికి చివరిరోజు కావడంతో ఇవాళ రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు కొనసాగించాయి. ఆదివారం కృష్ణకాంత్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ ప్రచారం కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొన్నాయి. సభలు, ర్యాలీలు, ఇంటింటికీ తిరిగుతూ ప్రచారాలతో హోరెత్తించాయి. ఉపఎన్నిక ప్రచారం గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి.
బూత్‌ల సమన్వయం బాధ్యత స్థానిక నాయకులపై పడింది. గత మూడు రోజులుగా పార్టీలు బూత్ ఇన్‌చార్జ్‌లు, వార్డ్ నేతలతో సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పోలింగ్ రోజున అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి 48 గంటలు కీలకమని, ఇప్పుడే బూత్ నియంత్రణ కోల్పోతే, ఇన్ని వారాలుగా చేసిన కృషి వృథా అవుతుందని స్థానిక నేతలకు ప్రధాన పార్టీలు చెప్పినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌లో స్థానిక నాయకులు, యువ సమన్వయకర్తలు, వాలంటీర్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ ప్రచారకర్తలు ఈ నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షిస్తూ, తమకు కేటాయించిన ప్రాంతాలు పూర్తిగా కవర్ అయ్యాయో లేదో వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు.
ఈ ఉపఎన్నిక ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో అవసరమైంది. బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలోని ఎఐఎంఐఎం మద్దతు ఉంది.
ఈ ఉపఎన్నికకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జూబ్లీహిల్స్‌లో అనేక రోజుల పాటు కాంగ్రెస్ ప్రచారాన్ని నడిపారు.
పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో నవంబరు 9న సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరిగే రోజు సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు (నవంబరు 14న) ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కూడా ఈ నిషేధం కొనసాగుతుందని చెప్పారు.