Telangana BJP: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై అన్ని పార్టీలు సీరియస్‌గా ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే గ్రామాల్లో బలంగా ఉండాలని..సర్పంచ్ ఎన్నికల్లో అప్పర్ హ్యాండ్ కోసం అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా తామేం తక్కువ కాదంటోంది. కాంగ్రెస్‌కు ఆల్టర్నేట్ తామేనని చెప్తున్న కమలనాథులు..సర్పంచ్ ఎన్నికల్లో దాన్ని ప్రూవ్ చేయాలని భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి..2028 ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారట. ఇప్పటినుంచే కార్యాచరణ సిద్దం చేసి వాటి అమలుకు నాయకులు సంసిద్ధంగా ఉండాలని డైరెక్షన్స్ ఇచ్చారట. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటితేనే..పార్టీని బూత్ లెవల్‌కు తీసుకెళ్లగలుగుతామని..అందుకోసం సర్పంచ్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారట. (Telangana BJP)
తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో బీజేపీ వాటా అంతంత మాత్రమే. ఇప్పటికీ ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంత స్ట్రాంగ్‌గా లేదు. అయినా మోదీ వేవ్..బీఆర్ఎస్ క్యాడర్ ఓటమి నైరాశ్యంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్న చర్చ ఉంది. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని..రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు కమలనాథులు.
ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి
కాంగ్రెస్‌కు ఆల్టర్నేట్ బీజేపీ అని ప్రూవ్ చేసుకోవాలంటే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూములుగా అయితే లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుంటాయ్. అయినప్పటికీ బీజేపీ ఈ స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందట.
అధికార కాంగ్రెస్‌కు ఆల్టర్నేట్ తామేనని చెప్పుకోవాలంటే కనీసం సెకండ్ ప్లేస్‌లో అయినా నిలవాలని భావిస్తున్నారట బీజేపీ లీడర్లు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగనప్పటికీ అన్ని సర్పంచ్ స్థానాల్లో బీజేపీ మద్దతుదారులను నిలబెట్టాలని అనుకుంటున్నారట. అంతే కాకుండా బీఆర్ఎస్‌ను ఓవర్ కమ్ చేసి రెండో ప్లేస్‌లో నిలవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని చెప్పుకొవాలనుకుంటున్నారట.
Also Read: Donthi Madhava Reddy: గతంలో సీఎం వరంగల్‌కు వెళ్తే పట్టించుకోని దొంతి.. ఇప్పుడేమో..
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో కార్యాచరణను అమలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి బండి సంజయ్ బీజేపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పది లక్షల నజరానా ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు నియోజకవర్గాల్లోనే తిష్టవేసి పార్టీకి పట్టున్న దగ్గర గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతున్నారట.
ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్‌బాబు వంటి నేతలు తమ నియోజకవర్గాల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేని దగ్గర స్వయంగా పార్టీనే రంగంలోకి దిగి అభ్యర్థులను నిలబెట్టడం, అభ్యర్థులు లేని దగ్గర బరిలో ఉన్న స్థానిక లీడర్లకు పార్టీ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. బీఎల్ సంతోష్ చేసిన దిశానిర్దేశం ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారట. మరి కమలనాథుల కసరత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.? ఏ మేరకు సత్తా చాటుతారో..వేచి చూడాలి.