మాజీ మంత్రి హరీశ్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు

బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్న ఆయన.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చి చెప్పారు.

Bandi Sanjay : బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. హరీశ్ రావు మంచి నాయకుడు అని కొనియాడారు. ఆయన ప్రజల మనిషి అని కితాబిచ్చారు. బీఆర్ఎస్ లో ఒక్క హరీశ్ రావు మాత్రమే మంచి పొలిటీషియన్ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ హరీశ్ రావు బీజేపీలో చేరాలన్నా రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేశారు. హరీశ్ రావే కాదు బీజేపీలోకి ఎవరు వచ్చినా రాజీనామా చేయాల్సిందే అన్నారు. పార్టీలోకి వచ్చే వారిని రాజీనామా చేయించి, గెలిపిస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్న ఆయన.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చి చెప్పారు.

కేసీఆర్, కేటీఆర్, వాళ్ల కుటంబం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హరీశ్ రావు మంచి పొలిటీషియన్. నేను ఓపెన్ గా అన్ని విషయాలు చెబుతా. ప్రజల్లోనూ హరీశ్ కు పేరుంది. ఉద్యమం చేసిన వ్యక్తి. హరీశ్ రావు మా పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. ప్రజా బలం ఉంది కాబట్టి ఆయన ఈజీగా గెలుస్తారు. ఆయన మంచి పొలిటీషియన్. అందులో ఏ అనుమానమూ లేదు. చిల్లర చిల్లరగా మాట్లాడడు. ఆయనేమీ నాకు దగ్గర కాదు. నాతో ఎప్పుడూ మాట్లాడింది లేదు.

కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామంటున్నారు- బండి సంజయ్
”కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయి. కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. మీకు ఏ పార్టీని చూసి ఓటు వేశారు? ఏ పార్టీ సింబల్ మీద ఓటు వేశారు? నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వెళ్తున్నామని ఎమ్మెల్యేలు కామన్ గా చెబుతున్న డైలాగ్. ప్రజలేమీ పిచ్చోళ్లు కాదు. ఆస్తులు కాపాడుకోవడం కోసం, అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం కోసం కామన్ డైలాగ్ చెప్పి పార్టీ మారిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం.. అక్రమ కేసులు పెట్టి బీజేపీ కార్యకర్తలను వేధించింది. జైలుకి పంపింది. దాన్ని ఏ బీజేపీ కార్యకర్త మర్చిపోడు.

బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచన చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం బీజేపీనే అని ప్రజలు భావిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని అబద్ధాలు సృష్టించినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వేయాల్సిన ఓటు మేము పొరపాటున కాంగ్రెస్ కు వేశామని తెలుసుకున్న ప్రజలు.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

 

Also Read : తెలంగాణ అప్పుల పాలైంది, రూ.7 లక్షల కోట్ల అప్పు నెత్తిన పెట్టి పోయారు- సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

 

ట్రెండింగ్ వార్తలు