Heavy Rain : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు.

heavy rain : ఇప్పటివరకూ మందగమనంతో సాగిన నైరుతీ రుతుపవనాలు.. ఇప్పుడు చురుకుగా కదులుతున్నాయి. మే 29న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించగా ఆ తర్వాత వాటి కదలిక మందగించడంతో వ్యాప్తి ఆలస్యమైంది. వర్షాలు కూడా అనుకున్న విధంగా పడలేదు. దీంతో ప్రతీ ఏడాది రుతుపవనాలు ప్రవేశించిన మొదటి వారంలో.. 6 నుంచి 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యేది. అయితే ఈసారి కేరళలో కేవలం 5సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అయితే ఇప్పుడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. రేపు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు చెప్పింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ చల్లటి కబురు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమదిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్‌ మీదున్న ఉపరితల అవర్తనం నుంచి .. దక్షిణ చత్తీస్‌గఢ్‌ వరకూ అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలతో పాటు ఆముదాలవలస, రాజాం, రణస్థలంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరించారు. అటు విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Thunderstorms : ఏపీలోని ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికం

నేటి నుంచి ఓవైపు వానలు.. మరోవైపు ఎండలతో తెలంగాణలో వాతావరణం మారిపోనుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పగలంతా ఎండలు దంచికొట్టనున్నాయి. వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. దీంతో ఈ జిల్లాల్లో వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక నేటి నుంచి మరో మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉదయం, రాత్రి సమయాల్లో చల్లని గాలులు, వానలు పడే అవకాశం ఉందని.. మధ్యాహ్నం ఎండలు దంచికొడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు