TPCC నాయకత్వంలో మార్పులు, రేవంత్‌కు పగ్గాలు ? సీనియర్లకు కీలక పదవులు!

Rewanth Reddy Get TPCC Chief : తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ.. టీపీసీసీ (TPCC) అధ్యక్షుడితో పాటు మొత్తం నాయకత్వంలోనే మార్పులకు ఢిల్లీలో అధిష్టానం సిద్దమైందా.. నిజమేనంటున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో భాగంగా ఛరిష్మాతో ఆర్థికంగా బలమైన నేతకు సారథ్య పగ్గాలు కట్టబెట్టి, సీనియర్లకు కీలక పదవులు కట్టబెట్టనుందట. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాడి వదిలేశారు. దీంతో నయా సారథి ఎంపిక అనివార్యమైంది. దీంతో కెప్టెన్ స్థానంలో కొత్త కెప్టెన్ కోసం కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ఆశావహులతో చర్చిస్తూనే ఉన్నారు. పీసీసీ (PCC) రేస్‌లో ఉన్న నేతలంతా హస్తినకేగి కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసి..తమకు ఛాన్స్ ఇస్తే స్టేట్‌ పార్టీని ఎంత బలోపేతం చేయగలమో పూస గుచ్చినట్లు వివరించారట.

ఆరేళ్ల తర్వాత : –
దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న దశలో పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. పార్టీలో పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ ఒక రకంగా పార్టీలో కాక రాజేసేంది. పాత, కొత్త గ్రూప్‌లుగా విడిపోయిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్‌, మల్లు భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు గట్టిగా యత్నించారు.

టీపీసీసీ నయా చీఫ్ రేవంత్ : –
తాజా సమాచారం మేరకు టీపీసీసీ నయా చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమించేందుకే హైకమాండ్‌ ఇష్టపడుతోందట. రేవంత్‌ను నియమించాలని మెజార్టీ నేతలు ప్రతిపాదించారని, క్షేత్రస్థాయి నుంచి అధిష్టానం తెప్పించుకున్న నివేదిక సైతం రేవంత్‌కే అనుకూలంగా ఉండడంతో ఆయనకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న సీనియర్లు అసంతృప్తి చెందకుండా..పీసీసీలోనూ, రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ సమూల మార్పులు చేయాలని డిసైడైందట. పీసీసీ చీఫ్‌ పదవికోసం గట్టిగా ట్రై చేసి సోనియా, రాహుల్‌తో కూడా సమావేశమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి ఆఫర్‌ చేసిందట.

సీనియర్లకు పదవులు : –
ఇందుకు ఒప్పుకుంటే ఓకే.., లేకపోతే సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఛాన్స్ ఇస్తుందట. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్‌, బీసీ కోటాలో మధుయాష్కీ, మైనార్టీ కోటాలో షబ్బీర్‌ అలీని నియమించాలని దాదాపుగా ఫిక్సయిపోయిందట. ఇక టీపీసీసీ సలహా కమిటీనొకదాన్ని ఏర్పాటు చేసి అందులో సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్యను నియమించనుందని తెలుస్తోంది. అటు ఉత్తమ్‌ను ఏఐసీసీలోకి తీసుకునే ఆలోచనా చేస్తుందట.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన : –
పీసీసీలో మార్పు చేర్పులే కాదు..రాష్ట్ర కాంగ్రెస్‌నే ప్రక్షాళన చేసే దిశగా అడుగులేస్తున్న అధిష్ఠానం.. సీఎల్పీ నేతగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం ఇస్తుందని ఓ టాక్‌ నడుస్తోంది. కోమటిరెడ్డి ..ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి తీసుకునేందుకు అంగీకరిస్తే.. మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కొనసాగించేందుకు అవకాశం ఉందని ఓ వాదన వినిపిస్తోంది. అదే జరిగితే శ్రీధర్‌బాబును వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయవచ్చు లేదా ఏఐసీసీలోకి తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. లేకపోతే మల్లు భట్టివిక్రమార్కకే ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మరోసారి ఛాన్స్‌ ఇచ్చి.. శ్రీధర్‌బాబును సీఎల్పీ నేతగా చేసే అవకాశం ఉందట. పీసీసీ కూర్పుపై మరోసారి రాహుల్‌గాంధీతో చర్చించనున్నారు ఏఐసీసీ నేత వేణుగోపాల్‌, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌. ఆ తర్వాత సోనియా ఆమోదంతో వచ్చే సోమ, మంగళవారాల్లో అధికారికంగా ప్రకటన విడుదల కానుందట.