BRS Party : బీఆర్ఎస్ పార్టీకి మరో ఎంపీ రాజీనామా.. కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ

పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

KCR

Ranjith reddy Resigns To BRS : పార్లమెంట్ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో ఎంపీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ పంపించారు. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ లేఖలో రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నిరోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు రంజిత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా రాజీనామాను ఆమోదించాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ నాకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రంజిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారిలో.. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ లు బీఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా రంజిత్ రెడ్డి రాజీనామాతో  బీఆర్ఎస్ ను వీడిన సిట్టింగ్ ఎంపీల సంఖ్య ఐదుకు చేరింది.

Also Read : ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం

2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పోటీచేసి విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. రంజిత్ రెడ్డి ఈసారి పోటీకి విముఖత చూపినట్లు సమాచారం. తాజాగా రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది తెలియజేయలేదు. అయితే, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ  లో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : CM Revanth Reddy : కేసీఆర్.. గంజాయి మొక్కలు నాటి వెళ్లారు.. ఒక్కొక్కటిగా పీకేస్తున్నాం

 

ట్రెండింగ్ వార్తలు