NV Ramana: తెలుగు ప్రజలు తల్లిదండ్రులు లేని లోటు తీర్చారు -ఎన్‌వీ రమణ

తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలియజేశారు ఎన్‌వీ రమణ.

Chief Justice Of India NV Ramana: తెలుగు రాష్ట్రాల్లో పర్యటన అనంతరం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు తెలియజేశారు ఎన్‌వీ రమణ. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించిన తెలుగుప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదని, సీజేఐగా ఈ వారంరోజుల పర్యటనలో తెలుగు ప్రజలు ఆ లోటు తీర్చారని అన్నారు.

తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన ఒకటన్నారు రమణ. వారం రోజుల పాటు తనను, తన సిబ్బందిని కంటికి రెప్పలా చూసుకున్న ప్రభుత్వ అధికారులు, హైకోర్టు సిబ్బంది, పోలీసులు, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని, తెలుగు ప్రజల దీవెనల బలంతో తన రాజ్యాంగ బద్ధ విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తాననే నమ్మకంతో ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు.

సామాన్యుని నుంచి సీఎం వరకూ ప్రతిఒక్కరూ స్వాగతం పలికి అంతా మనోళ్లే అన్న తెలంగాణ నైజానికి, సుప్రసిద్ద హైదరాబాదీ ఆతిథ్యానికి సంతోషంగా ఉందని అన్నారు ఎన్‌వీ రమణ. అనూహ్య స్వాగతం పలికిన గవర్నర్‌, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు ధన్యవాదాలు చెప్పారు. యాదాద్రిని దేశంలోనే అతి ముఖ్య తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు.

ట్రెండింగ్ వార్తలు