Cm Kcr Early Elections
CM KCR Early Elections : తెలంగాణలో మురోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? దేశ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేసీఆర్.. అంతకంటే ముందే తెలంగాణలో పాగా వేసి ఆ తర్వాత ఢిల్లీలో జెండా ఎగరవేయాలని ఆలోచనలో ఉన్నారా? షెడ్యూల్ ప్రకారం 2024లో లోక్ సభ ఎన్నికలు, వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అయితే, 2024 పార్లమెంటు ఎన్నికలకు ఏడాది ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ముందస్తుకు వెళతారనే ప్రచారం మొదలైంది.
2019లో సార్వత్రిక ఎన్నికలకు ముందే అసెంబ్లీని రద్దు చేసి 2019లో ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందస్తు ఆలోచనల్లోనే ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయడంతో పాటు తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడంపై ఫోకస్ పెంచారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
తెలంగాణ ఉద్యమ సారథిగా, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్ 2014లో తొలిసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చారు. తర్వాత మళ్లీ 2019లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి కూడా ముందుకెళ్లి మూడోసారి ఘన విజయం సాధించేందుకు వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది.
ఏ రాష్ట్రంలో అయినా ఒకే పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వస్తే దేశం అటెన్షన్ ఆటోమేటిక్ గా ఆ స్టేట్ మీదకు మళ్లుతుంది. దేశ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తారు. దీని మీదే ఇప్పుడు కేసీఆర్ ఫోకస్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీ దేశానికి గుజరాత్ మోడల్ ను చూపించినట్లే ఈసారి తెలంగాణ పాలనను రోల్ మోడల్ అనే చూపించే దిశగా హ్యాట్రిక్ విక్టరీపై కేసీఆర్ దృష్టి పెట్టారు. తద్వారా భారతీయుల దృష్టిని ఆకర్షించాలని చూస్తున్నారు. బీజేపీ-కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దాలంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత బీఆర్ఎస్ పై పూర్తి దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Chandrababu Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వాదనకు బలం చేకూర్చేలా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఓ మాట అన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు, అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. పబ్లిక్ లో ఇమేజ్ ఉన్నవారికే టికెట్ అని చెప్పేసరికి తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు ఖాయమనే చర్చ మొదలైంది.
ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నాయకత్వం కూడా నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయమే ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలవడం ఖాయం అని స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే చర్చ రాజకీయవర్గాల్లోనే కాదు పబ్లిక్ లోనూ జోరుగా నడుస్తోంది.