cm kcr letter to pm modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని లేఖలో కోరారు. పరీక్షలను హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే జరపడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు సీఎం కేసీఆర్. ఈ కారణంగా చాలా రాష్ట్రాల యువకులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కేసీఆర్. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయభాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు.
అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కూడా సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్ నకు త్వరగా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్ ను విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు సీఎం కేసీఆర్.
కాగా, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖ చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చెప్పింది కరెక్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే దానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు.