Cm Kcr Orders Inquiry Into Land Grab Allegations Against Minister Itala Rajender
Minister Itala Rajender : మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడినట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చాయి. మెదక్ జిల్లాలో పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమిని ఆక్రమణలకు గురయ్యింది. బెదిరించి భయపెట్టి.. ఈ భూములను లాక్కున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ భూదందాలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పైనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఈటల, ఆయన అనుచరులు కలిసి వంద ఎకరాల అసైన్డ్ భూమిని లాక్కున్నారంటూ బాధితులు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో వంద మంది రైతులకు చెందిన వంద ఎకరాలను ఇప్పటికే ఈటల అనుచరులు ఆక్రమించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
భూమి మంత్రి ఈటల కుటుంబీకుల పేర్లతోనే రిజిస్ట్రేషన్ అయ్యిందని రైతులు అంటున్నారు. ఈటల అనుచరులుగా చెప్పుకునే అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డిలు.. ఈ రెండు గ్రామాల్లో కబ్జాకాండను కొనసాగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు బాధితులు. అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోబోతోందంటూ తమను బెదిరించి భూమి పత్రాలను లాక్కున్నారంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్లో భారీ స్థాయిలో ఫౌల్ట్రీ షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఎంకు కంప్లైట్ వెళ్లింది. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని.. తమ భూములను తిరిగి తమకు ఇప్పించాలంటూ మొరపెట్టుకుంటున్నారు రైతులు.
ఈ భూదందా విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూదందాపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తునకూ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా, టిఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఈటలపై భూ ఆక్రమణ ఆరోపణలు రావడంతో రాజకీయంగానూ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టిఆర్‌ఎస్‌కు ఏర్పడింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ డీజీ పూర్ణచంద్రరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. అంతకుముందే జిల్లా కలెక్టర్‌ల ద్వారా దర్యాప్తు జరిపి నివేదిక అందిచాలని సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే ముఖ్యమంత్రి ఏ రకంగా రియాక్ట్ అవుతారన్నదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక కబ్జాకు గురైన భూములపై కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి ఈటల.. తన హ్యాచరీస్ విస్తరించాలనుకుంటే, చుట్టుపక్కలన్నీ అసైన్డ్ భూములున్నాయని.. వాటిని తనకు ఇవ్వాలని అధికారులను అడిగానన్నారు.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. కొంతమంది రైతులే తమ దగ్గరకు వచ్చి భూములు కొనుగోలు చేయమని కోరారన్నారు. కేవలం కబ్జా ఆరోపణలపైనే కాకుండా.. తన మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జ్‌తో పాటు.. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరపాలన్నారు.. అణచివేతలకు, దొరతనాలకు వ్యతిరేకంగా పోరాడిన వాడినని.. తాను భయపడేది లేదన్నారు. ఈ విచారణలో తాను తప్పు చేసినట్లు తేలితే శిక్ష విధించవచ్చన్నారు ఈటల. విచారణలో తప్పు జరిగినట్లు తెలితే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తనకు ఈ పదవులు అంటే గౌరవమే కానీ.. వాటి కోసం లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. తన ఆత్మగౌరవానికన్నా ఈ పదవేమి గొప్పది కాదన్నారు. తన నియోజకవర్గంలో ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మంత్రి సవాల్ విసిరారు.
తనపై వస్తున్న ఆరోపణలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని… ఆ విచారణలో తాను తప్పు
చేసినట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు మంత్రి ఈటల. తాను తప్పు చేసినట్టు తెలితేనే రాజీనామా చేస్తానని.. అప్పటి వరకు రాజీనామా చేయనంటూ కుండబద్ధలు కొట్టారు ఈటల. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే తాత్కాలికంగా న్యాయం అపజయం పొందినట్లు అనిపిస్తోందని.. కానీ అంతిమ విజయం ధర్మానిదే అన్నారు. ధర్మాపురం అనే మారుమూల గ్రామంలో తాను జమున హ్యాచరీస్‌ను ఏర్పాటు చేశామని.. అప్పట్లో ఎకరా భూమిని 6 లక్షల చొప్పున 40 ఎకరాలు కొని హ్యాచరీస్‌ను ఏర్పాటు చేశానన్నారు. తాను ఇప్పుడు కెనరా బ్యాంక్ నుంచి 100 కోట్ల రుణం తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.