ప్రజలు సహకరించాలి..లేకపోతే..24 గంటలు కర్ఫ్యూ విధిస్తాం – కేసీఆర్ వార్నింగ్

  • Publish Date - March 24, 2020 / 02:05 PM IST

కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని, లేనిపక్షంలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది..ఆర్మీని దించుతాం..షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తేవాల్సి వస్తుదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తర్వాత ఆర్మీని కూడా దించుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కేసులు నమోదైనట్లు తెలిపారు. 

2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య, పోలీసు, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. 

114 మంది అనుమానితున్నారని, వారి నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న కేసులు ఏప్రిల్ 7వ తేదీ కల్లా కోలుకుని డిశ్చార్జ్ అవుతారని కేసీఆర్ వెల్లడించారు. అలాగే విదేశీయుల పాస్ పోర్టు సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. 

2020, మార్చి 24వ తేదీ మంగళవారం మరో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన సంఖ్య 36కి చేరుకుంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. కేసీఆర్ సర్కార్ వైరస్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. లండన్ నుంచి వచ్చిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు ఉన్నట్లు గుర్తించారు. అలాగే..జర్మని నుంచి వచ్చిన 39 ఏళ్ల మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 61 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.