తెలంగాణతో ప్రణబ్‌కు అనుబంధం…ప్రణబ్‌ పెట్టిన సంతకంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ

  • Publish Date - September 1, 2020 / 01:04 PM IST

దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ సంతకం పెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్‌ పునః విభజన బిల్లుపై సంతకం చేశారు. ఆయన జారీ చేసిన ప్రత్యేక గెజిట్‌ ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ప్రణబ్‌ నాయకత్వం వహించారు.



2004లో :
2004లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆరు శాఖలు కేటాయించారు. ఆ తర్వాత రాష్ర్ట ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచారు.

2005లో ప్రణబ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం
దీంతో కేంద్ర ప్రభుత్వం 2005 మార్చిలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 8 వారాల్లో ఈ కమిటీ తన నివేదికను ఇస్తుందని కేంద్రం ప్రకటించింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పాలని ప్రణబ్ కమిటీ అన్ని పార్టీలకు లేఖలు రాసింది. అప్పట్నుంచి రాష్ట్రం ఏర్పడే వరకూ… తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ప్రణబ్‌ ముఖర్జీ కీలకపాత్ర పోషించారు. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్‌ పెట్టిన సంతకంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.



సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి :
తెలంగాణతో ఎంతో అనుబంధం ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాతో తనకున్న అనుబంధాన్ని గతంలో ఓ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణను సాధించినందుకు తనను ప్రణబ్ ముఖర్జీ అభినందించారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన విషయాలు తన జీవితంలో ప్రత్యేకం అన్నారు.
https://10tv.in/celebrities-tweet-on-pranab-mukherjee-demise/
చంద్రశేఖర్ రావు నువ్వు అలా కాదు :
చాలామంది ఉద్యమాలు ప్రారంభిస్తారు. వాళ్లు మధ్యలోనే చచ్చిపోతే వేరే వాళ్ల నాయకత్వంలో ఫలితాలు వస్తాయి. కానీ, చంద్రశేఖర్ రావు నువ్వు అలా కాదు… తెలంగాణ ఉద్యమాన్ని నువ్వే ప్రారంభించావు… నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నావు. ఎవరికీ దక్కని అదృష్టం నీకు లభించిందని ప్రణబ్ అన్నట్లు కేసీఆర్‌ చెప్పారు.



ఎన్నో విలువైన సూచనలు చేశారు : 
తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌లో న్యాయం ఉందని భావించేవారని… తాను కలిసిన ప్రతీసారి ఎన్నో విలువైన సూచనలు చేసే వారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ప్రణబ్‌ రాసిన పుస్తకాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రణబ్‌కు నివాళి అర్పించారు.